Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడులు
- ఆర్భాటాలే.. సహాయమేదీ !
- ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతుల వేడుకోలు
రైతే దేశానికి వెన్నుముక. రైతు లేనిదే దేశం లేదు.. రైతే రాజు.. ఇలా ఎన్ని నినాదాలు ఉన్నప్పటికీ రైతు సంతోషంగా ఉన్న రోజు లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న మాత్రం అప్పుల ఊబి మాత్రం బయటపడటం లేదు. రైతుల కోసం.. వ్యవసాయం కోసం ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెట్టామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకుంటున్నా.. రైతు అప్పుల సుడిగుండం నుంచి బయటకు రాలేకపోతున్నారు. పెట్టుబడికి అప్పు చేయనిదే సాగు చేయలేని పరిస్థితి. పంటకు ధర లేక చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడం తప్ప.. అసలు మాత్రం అలానే ఉంటుంది. ఏడాదికేడాది అప్పులు చాంతాడులా పెరిగిపోతుండటంతో విధిలేని పరిస్థితుల్లో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
నవతెలంగాణ - మెఫిసిల్ యంత్రాగం
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం.. పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా రైతు ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెబుతూనే మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నది. రెండు వేల రూపాయల చొప్పున ఏడాదికి మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు ఇస్తున్నామని.. అదే వ్యవసాయానికి పెద్ద ఊతకర్ర అన్నట్టు ప్రధాని మోడీ భ్రమింపచేస్తున్నారు. రెండు వేల రూపాయలతో రైతు ఎలా రాజు అవుతారో బీజేపీ నేతలు చెప్పాలని రైతు సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. రైతుబంధుతోనే రైతు సంతోషంగా ఉన్నారంటున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. రుణమాఫీ విషయంలో ఇప్పటివరకు పూర్తిచేయలేదు. రాష్ట్రంలో 91.7 శాతం మంది రైతులు అప్పులు చేశారు. ఇది ప్రభుత్వాలు చెప్పిన అధికారిక లెక్కలే. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్‌లో 80 శాతం పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వరి కోయకుండానే వదిలిపెట్టగా.. మరికొన్నిచోట్ల పత్తి, మొక్కజొన్న పైర్లు నీట మునిగి రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. దానికి తోడు మార్కెట్ విధానం సరిగ్గా లేకపోవడంతో ధాన్యం నెలలకొద్ది మార్కెట్‌లో పెట్టడంతో రైతులపై అదనపు భారం పడింది. ఒక్కో మార్కెట్లో సుమారు రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ధాన్యం రాసులు నిలువ ఉన్న పరిస్థితి. ధాన్యం రక్షణ కోసం రైతులు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం రబీలో చాలాచోట్ల పంటలు వేయకుండా భూములను బీడులుగా ఉంచారు. ఒక్కో రైతు కుంటుంబం రూ.5 లక్షల వరకు అప్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో .. అటు వ్యవసాయాన్ని వదులుకోలేక.. మరో పని చేయలేక.. ఎలాగోలా కష్టపడి నెట్టుకొస్తున్నామని రైతులు చెబుతున్నారు. లక్ష్యాల మేరకు రుణాలివ్వాలని, వెంటనే రుణ ప్రణాళికలు తయారు చేసి రైతులను ఆదుకోవాలని రైతుసంఘం నాయకులు కోరుతున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల రైతులను 'నవతెలంగాణ' కదిలించగా తమ కన్నీటి గాధను వివరించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వరి రైతులపై రూ.2400 కోట్ల భారం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 80 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రాజెక్టుల ద్వారా సాగునీరుందనే ఉద్దేశంతో రైతులు వలసలు మాని పంటలను సాగు చేసుకుంటున్నారు. జిల్లాలో దాదాపు 17 లక్షల ఎకరాలు సాగు చేస్తారు. ఇందులో వరి, పత్తి పంటలే 10 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. అయితే, రెండేండ్లుగా ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు 80 శాతం దెబ్బతిన్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న పంటల పెట్టుబడులు మీద పడ్డాయి. ఎకరాకు రూ.40 వేలకు పైగానే పెట్టుబడి అవుతోంది. వరి సాగు చేసిన రైతులపై రూ.2400 కోట్లు, పత్తి సాగుదారులపై రూ.1200 కోట్ల భారం పడింది. సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక తిరిగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు దాపురించాయి. మదనాపూరం, ఊర్కోండ, బల్మూరు మండలాలతో పాటు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఆరు నెలల కాలంలో 10 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
రెండెకరాలు కౌలుకు తీసుకుంటే మిగిలింది రూ.400 లే
''రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరిల్లిలో రైతు కైరనాయక్ రెండెకరాల భూమి కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తే.. పంటకు వచ్చిన ఆదాయం రూ.78,400. పంట సాగుకు పెట్టిన పెట్టుబడి రూ.50 వేలు, కౌలు ఎకరాకు రూ.8 వేల చొప్పున రెండెకరాలకు రూ.16వేలు. పంటకు వచ్చిన ఆదాయం 78,400 నుంచి రూ.66 వేలు పెట్టుబడి పోగా రైతుకు మిగిలింది రూ.12,400. ఇవి కాస్తా పంట పెట్టుబడికి తెచ్చిన అప్పు రూ.50 వేలకు వడ్డీ కింద రూ.12వేలు పోతే.. ఆర్నెల్లు కష్టపడిన రైతుకు మిగిలింది రూ.400 మాత్రమే. కనీసం దినసరి కూలి డబ్బులు కూడా రాని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది.
రుణ ప్రణాళికతో రైతులకు భరోసా కల్పించాలి
రైతుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. రెండేండ్లుగా దిగుబడులు తగ్గి రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రుణ ప్రణాళికను తయారు చేయాలి. ఇప్పటికే రైతులు అభద్రతాభావంలో ఉన్నారు. వీరికి భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- ఎ.రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్
ప్రభుత్వమే ఆదుకోవాలి.. వర్షాలతో కుసుమ పంటకు నష్టం
రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటగా కుసుమను 14 ఎకరాల్లో సాగు చేశాను. ఎకరానికి 20 నుంచి 25 వేల వరకు పెట్టుబడి పెట్టి పంటను కంటికి రెప్పలా చూసుకున్నాను. పంట చేతికొచ్చే చివరి దశలో (గత జనవరి చివరి వారంలో) తుఫాన్ వచ్చి పూర్తిగా దెబ్బతిన్నది.
- బాసం నరసింహారెడ్డి- రాయపోల్(సిద్దిపేట)
ప్రభుత్వమే ఆదుకోవాలి..
ఆర్థిక పరిస్థితులు భారమై.. అప్పుల బాధ తాళలేక రెండేండ్ల కిందట నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు. అధికారులు స్పందించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేయాలి.
- బోయిని రామమ్మ, పైతర(మెదక్ జిల్లా)
పెట్టుబడులు పెరుగుతున్నాయి
నాకు రెండెకరాల పొలం ఉన్నది. గత వానాకాలంలో దొడ్డు రకం వరి పండించాను. అప్పుడు పెట్టుబడి రూ.45వేలు అయింది. అదే పొలంలో ఇప్పుడు సన్నరకం, దొడ్డు రకం పండిస్తున్నాను. ప్రస్తుతం ఎరువుల ధరలు, కలుపు ఖర్చులు పెరగడంతో ఇప్పటికే రూ.53వేల పెట్టుబడి అయింది. పంట చేతికొచ్చే సరికి ఇంకెంత అవుతుందో.. దిగుబడి మాత్రం అనుకున్నంత రావట్లేదు.
- చాకలి రాజు, అనంతసాగర్(మెదక్)
సాగు చేయాలంటే భయమేస్తుంది
పంట పెట్టుబడులకు అధిక ఖర్చు కావడం వల్ల వ్యవసాయం చేయాలంటే చాలా భయంగా ఉంది. ఎకరం పొలం చదును చేయాలంటే తొమ్మిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కామారెడ్డికి సమీపంలో ఉండటంతో నాటు వేయడానికి ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఖర్చవుతుంది. మందులు, పంట చేతికొచ్చే వరకు సుమారుగా ఎకరానికి 45వేల రూపాయలు ఖర్చవు తుంది. ఈసారి ప్రభుత్వాలు వడ్లు కొనబోమని చెప్పడంతో రెండెకరాల్లో జొన్న వేశాను. అది మొలక రాకపోవడంతో, మళ్లీ గోధుమలు వేశాను.
- రైతు ప్రశాంత్, నరసన్నపల్లి, కామారెడ్డి
ప్రభుత్వం ఆదుకోకపోతే కష్టమే
నాలుగెకరాల వ్యవసాయ పొలాన్ని కౌలుకు తీసుకు న్నాను. కానీ అప్పులే పెరిగాయి. ఈ ఏడాది అధిక వర్షాల కు పంటలు దెబ్బతిన్నాయి. ఐదెకరాలు సాగు చేస్తే 3 లక్షల అప్పు అయింది. రెండెకరాలు కోయకుండానే వదిలి పెట్టాను. ప్రభుత్వం ఏమైనా ఆర్థిక సహాయం చేయకపోతే బతకడం కష్టమే.
- వెంకటేష్ గుంతకోడూరు- నాగర్ కర్నూల్ జిల్లా