Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయం వైపు యువకులు దృష్టి సారించాలి
- : అఖిల భారత కిసాన్‌సభ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ- కొణిజర్ల
ఢిల్లీ రైతాంగ స్ఫూర్తితో బలమైన పోరాటాలు చేయాలని, రాబోయే రోజుల్లో యువకులు చదువుతోపాటు ఉద్యోగాలు చేస్తూ వ్యవసాయం వైపు దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉందని అఖిల భారత కిసాన్‌సభ (ఏఐకేఎస్) ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో తెలంగాణ రైతుసంఘం జిల్లా రెండోవ మహాసభ సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. తొలుత ఇటీవల ప్రజాసంఘాల్లో పనిచేస్తూ మరణించిన వారికి, ఢిల్లీ ఉద్యమంలో అమరులైన వారికి సంతాపం తీర్మానాన్ని రైతుసంఘం జిల్లా నాయకులు తాతా భాస్కర్‌రావు ప్రవేశపెట్టారు. అనంతరం సారంపల్లి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కోసం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డిల్లీలో ఏఐకేఎస్ నాయకత్వంలో 510 రైతుసంఘాలతో సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో పదకొండు నెలలపాటు బలమైన ఉద్యమాన్ని నిర్మించినట్టు తెలిపారు. 750 మంది రైతుల త్యాగం ఫలితంగానే మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌లో మూడుచట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిందన్నారు. ఢిల్లీ ఉద్యమంలో మరణించిన రైతులకు ఎక్స్‌గ్రేషియో నేటి వరకూ చెల్లించకపోవడం బాధాకరమన్నారు. ఉద్యమ సమయంలో రైతులపై, రైతుసంఘాల నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలోని వివిధ దేశాలకు పంటలను ఎగుమతి చేసేదని, ప్రస్తుతం మనమే బయట దేశాల నుంచి పంచదార, పసుపు, పత్తి లాంటి వాటిని దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చిందని వాపోయారు. దీనికి ప్రధానకారణం కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలనేనని విమర్శించారు. రాష్ట్రంలో హైవే నిర్మాణాల కోసం మంచిగా పండే భూముల్లో 20శాతం భూమి రైతుల చేకూరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాని ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంతో కనీసం ఆరెకరం భూమి కూడా రైతులకు దొరికే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఈనెల 21న ప్రజా, కార్మిక, కర్షక, యువత సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించి.. 28, 29 తేదీల్లో భారత్ బంద్‌కి పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈబంద్‌లో రాజకీయాలకుతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మహాసభలో రైతుసంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌రావు, తీగల సాగర్, జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వరరావు, ఆహ్వానసంఘం అధ్యక్ష కార్యదర్శులు కొప్పుల క్రిష్ణయ్య, తాళ్లపల్లి కృష్ణ, బండి రమేష్, చింతనిప్పు చలపతిరావు, వ్యకాస జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పొన్నం వెంకటేశ్వరరావు, మెరుగు సత్యనారాయణ, షేక్ మీరా, ఊరడి సుదర్శన్‌రెడ్డి, రైతుసంఘం జిల్లా నాయకులు, ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.