Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్లు, భవనాల శాఖలో విలీనం
- సీఎం వద్దకు చేరిన ప్రతిపాదనలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దశాబ్దాలుగా పేదల ఇండ్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పేదింటి కలను నిజం చేసింది. ఇల్లులేని పేదలకు సేవ చేసింది.ఈ కాలంలో కొన్ని లక్షల ఇండ్లు నిర్మించింది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఈ శాఖ సాక్షిభూతంగా నిలిచింది. అలాంటి శాఖ క్రమంగా కాలగర్భంలో కలిచిపోనుంది. గృహ నిర్మాణ శాఖ త్వరలో రోడ్లు, భవనాల శాఖలో విలీనం కానున్నట్టు తెలిసింది. దానికి సంబంధించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్టు సమాచారం. ఈ ఫైల్‌పై సీఎం ఆమోద ముద్ర పడిన తర్వాత అధికారికంగా రోడ్లు, భవనాల శాఖలో విలీనమైనట్టు ప్రభుత్వం ప్రకటించనుంది. ఇక ముందు పేదల ఇండ్ల నిర్మాణం రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో జరగనుంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక గృహ నిర్మాణశాఖ అనేక ఒడిదుడులకు లోనైంది. ఇందిరమ్మ ఇండ్లలో పెద్ద ఎత్తున్న అవినీతికి జరిగిందనీ, అందువల్ల సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తూ సర్కారు నిర్ణయించింది.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఆ శాఖ ఉద్యోగులు, స్థానిక ప్రజా ప్రతినిధులు చాలా మంది అవినీతికి పాల్పడ్డారని తేల్చింది. దీంతోపాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని తలదన్నే పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్టు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. అదే డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల పథకం. రాష్ట్ర ప్రభుత్వం 2,68,245 రెండు పడక గదుల ఇండ్లు పేదలకు ఉచితంగా నిర్మించి ఇస్తామని ప్రకటించింది. హైదరాబాద్‌లో లక్ష ఇండ్లు, ఇతర ప్రాంతాల్లో లక్షన్నర ఇండ్లు నిర్మించాలనే లక్ష్యాన్ని నిర్ధేశించింది. సింబాలిక్‌గా కొన్ని జిల్లా కేంద్రాల్లో మాత్రమే కొన్ని ఇండ్లను పూర్తి చేసింది. కానీ పల్లెలకు ఇంకా ఈ పథకం రాలేదు. పట్టణాలలో 'మోడల్‌హౌజ్‌్' లా డబుల్ బెడ్ రూమ్‌లు నిర్మించి ఇదిగో ఇలా ఉంటాయి అని పేదలకు చూపించి రాజకీయంగా లబ్ది పొందాలనే వ్యూహం కనిపిస్తున్నది. ఇప్పటికీ హైదరాబాద్‌లో 85వేల ఇండ్లను పూర్తి చేసింది. అందులో 4,500లకు పైగా ఇండ్లను మాత్రమే లబ్దిదారులకు అందజేసింది. ఇతర ప్రాంతాల్లో 50వేల ఇండ్లను పూర్తి చేసింది. మిగతా చోట్ల వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నాయి. డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు.
ఈ క్రమంలో భవిష్యతులో కొనసాగనున్న ఇండ్ల నిర్మాణాలు రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో కొనసాగే అవకాశం ఉందని సమాచారం.