Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సోమ, మంగళవారాల్లో జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో రాష్ట్రంలోని చేతి వృత్తిదారులందరూ భాగస్వాములు కావాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎంవీ రమణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జరగనున్న సమ్మెలో చేనేత, కల్లుగీత, మత్స్య, రజక ,గొర్రెల మేకల పెంపకం దారులు, వడ్డెర, విశ్వకర్మ, క్షౌర, తదితర వృత్తిదారులు వృత్తి పరికరాలతో సమ్మెలో పాల్గొని తమ నిరసనను తెలపాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు పి ఆశయ్య, యం బాలకృష్ణ, ఉడత రవీందర్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు అప్పనంగా కట్టబెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపదను పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్నదని తెలిపారు. ప్రయివేటీకరణ వల్ల బీసీ, ఎస్సీ , ఎస్టీ తదితర సామాజిక తరగతుల కొద్దిపాటిగా ఉన్న రిజర్వేషన్లు కోల్పోతారని తెలిపారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటం అన్యాయమని పేర్కొన్నారు. ఉద్యోగులకు భద్రత లేకుండాపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వదేశీ జపం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం విదేశీ సంస్థలకు దేశ సంపదను కట్టబెడుతున్నదని తెలిపారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే వృత్తిలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే..అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు పెరగటంతో వృత్తిదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సమ్మెలో పాల్గొనాలని కోరారు.