Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మెను సక్సెస్ చేద్దాం
- ఆల్‌ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ సమ్మెను సక్సెస్ చేద్దాం
- ఆల్‌ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 28, 29 తేదీల్లో జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఆల్‌ట్రేడ్ యూనియన్స్ నాయకులు డిమాండ్ చేశారు. సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్ జిల్లా ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కు వద్ద ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ కాలేజ్, వీఎస్‌టీ మీదుగా బస్‌భవన్ వద్దకు చేరుకుని, తిరిగి సుందరయ్య పార్కు వద్ద ముగిసింది. ఈ బైక్ ర్యాలీలో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కమతం యాదగిరి, నగర కార్యదర్శి ఎం. నరసింహ, సీఐటీయూ నగర కార్యదర్శి ఎం. వెంకటేశ్, ఉపాధ్యక్షులు జె.కుమారస్వామి. హెచ్‌ఎంఎస్ నగర అధ్యక్షులు మహమ్మద్ అంజద్, ఉపాధ్యక్షులు సీహెచ్ మహేశ్, ఐఎఫ్‌టీయూ నగర అధ్యక్షురాలు ఎస్‌ఎల్ పద్మ, ఉపాధ్యక్షులు ఎం.హన్మేశ్, ఐఎఫ్‌టీయూ నగర అధ్యక్షులు జి. అనురాధ, ఉపాధ్యక్షులు తెలంగాణ శ్రీనివాస్, టీఎస్‌ఎంఆర్‌యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భాను కిరణ్, రాజుభట్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి ఆల్ ట్రేడ్ యూనియన్స్ నాయకులు మాట్లాడారు. కేంద్ర ప్రభు త్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వదేశీ జపం చేసే బీజేపీ ప్రభుత్వం దేశానికి వెన్నెముకగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలైన రైల్వే, రక్షణ, ఎల్‌ఐసీ, బ్యాంకులు, విశాఖ ఉక్కు, ఓడరేవులు, బీఎస్‌ఎన్‌ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ భూములు, రోడ్లను కూడా వదలకుండా స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు, విదేశీయులకు కట్టబెట్టడమేనా బీజేపీ చెప్పేదేశభక్తి? అని ప్రశ్నించారు. నరేంద్రమోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ సర్కార్ ప్రజల వైపు ఉంటదా లేక అదాని, అంబానీ, టాటాబిర్లా వంటి స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులవైపు ఉంటదా తేల్చుకోవాలని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం తన ప్రజావ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి. ఇప్పటికే ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను, స్కీం వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను తగ్గించాలన్నారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. 'ప్రజలను కాపాడండి- దేశాన్ని రక్షించండి' అనే నినాదంతో మార్చి 28 29 తేదీలలో జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో హైదరాబాద్ నగరంలో ఉన్న కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.