Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీకు, సిమెంట్, డీజిల్, తదితరాల ధరలపై కేంద్రం నియంత్రణ కరువు
- దీంతో తగ్గుతున్న నూతన నిర్మాణాలు
- ఉపాధి కోల్పోతున్న భవన నిర్మాణ కార్మికులు
- అడ్డా ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కరువు
- రెండు రోజుల సమ్మెలోకి భవన నిర్మాణ కార్మికులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అందమైన అద్దాల మేడలను కట్టే భవన నిర్మాణ కార్మికుల బతుకులు గుడిసెల్లో మగ్గుతున్నాయి. రంగులేసి ఇంటికి వన్నెలద్దె కార్మికుల జీవితాల్లో చీకట్లు ఆవరిస్తున్నాయి. పొట్టకూటి కోసం పట్నమొచ్చి అడ్డాలమీద పనికోసం ఆశగా ఎదురుచూసే వేలాది మందిలో పని దొరికేది వందల మందికే. మిగతా కుటుంబాలన్నింటికీ ఆరోజు పస్తులే. మేస్త్రికి రోజుకు వెయ్యిరూపాయలంట..గాళ్లదే మంచిగున్నదని అనుకునేటోళ్లేగానీ అతనికి నెలకు పది, పదిహేను రోజులకు మించి పనిదొరకదనే విషయాన్ని ఎరుగట్లేదు. అందులోనూ పెట్రోల్‌కే రోజుకు ఓ రెండొందలు ఖర్చు. రెక్కలు అరుగంగ కష్టం చేసినా పూట గడువటం కష్టమే. అడ్డాల వద్ద గంటల తరబడి నిలబడలేక, ఇతర సమస్యలతో మహిళా కూలీలు పడే వ్యథలు అన్నీఇన్నీ కావు. మాకంటూ కొన్ని చట్టాలుంటే ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఏండ్ల తరబడి కొట్లాడగా వచ్చిన మూడు చట్టాలనూ మోడీ సర్కారు రద్దు చేసి వాల్ల నోట్లో మన్నుగొట్టింది. ధరలమీద మోడీ సర్కారు నియంత్రణలేమితనంతో నిర్మాణ రంగం కుదేలై భవన నిర్మాణ కార్మికుల బతుకులు మరింత దుర్భరంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు తమ హక్కుల కోసం గళమెత్తుతూ రెండు రోజుల సార్వత్రిక సమ్మెలో పాలుపంచుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
రాష్ట్రంలో 21 లక్షల వరకు భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులున్నారు. వీరిలో సగానికిపైగా వలస కార్మికులే. ఎనిమిది లక్షల మంది మహిళా కార్మికులున్నారు. వీరిలో 80 శాతం మంది అడ్డాకూలీలే. వీరికి రోజుకు రూ.500 నుంచి రూ.1000 కూలి దక్కుతున్నది. అయితే, వలస కార్మికులు కాంట్రాక్టర్లు రోజుకు రూ.300-400కి మించి ఇవ్వడం లేదు. కరోనా, నిర్మాణరంగంలో వాడే సీకు, సిమెంట్, ఇతర వస్తువుల ధరలు ఏడాదిలోనే రెట్టింపు అయ్యాయి. సిమెంట్ బస్తా రూ.350 నుంచి రూ.450(బ్రాండ్లను బట్టి) దాకా చేరింది. టన్ను ఐరన్ 85 వేలు అయింది. దీంతో బిల్డర్లు నిర్మాణాలను తగ్గిస్తున్నారు. అదే సమయంలో వ్యయాన్ని తగ్గించుకునేందుకు కన్‌స్ట్రక్షన్ కంపెనీలకు బిల్డర్లు ఇచ్చేస్తున్నారు.
తగ్గుతున్న కూలి, పనిదినాలు...పెరుగుతున్న రోగాలు
రాష్ట్రంలో ఏటేటా పెరిగిపోతున్న నిరుద్యోగులు, బీహార్, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, తదితర రాష్ట్రాల నుంచి వలసొస్తున్న వారితో భవన నిర్మాణ కార్మికులపై ప్రభావం పడుతున్నది. గతంలో వారానికి నాలుగైదు రోజుల పనిదొరికేది. ప్రస్తుతం వారంలో రెండు, మూడు రోజులే దొరుకుతున్నది. ఎక్కువ సంఖ్యలో కూలీలు అడ్డాల మీదకు వస్తుండటంతో పెద్ద మేస్త్రీలు, నిర్మాణదారులు కూలి తగ్గించుకుంటేనే పనికి తీసుకెళ్తున్నారు. వెయ్యిరూపాలిచ్చేకాడ రూ.700 నుంచి రూ.800 మాత్రమే ఇస్తున్నారు. 50 ఏండ్లు నిండిన వారు వేగంగా పనిచేయరని పిలవట్లేదు. అడ్డాల్లో, పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాలు లేక కార్మికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అక్కడ కనీసం నిలబడేందుకు నిలువునీడలేని పరిస్థితి. మహిళా కూలీలైతే బయటికెళ్తే బాత్‌రూమ్ ఉండని పరిస్థితుల్లో నీళ్లు తాగటమే తగ్గించేస్తున్న పరిస్థితి ఉంది. భవన నిర్మాణ కార్మికులు పనిదినాలను కోల్పోయి అభద్రతకు గురవుతున్నారు. దీనికితోడు రోజురోజుకీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో వారి కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాలి
కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కోసం తీసుకొచ్చిన మూడు చట్టాలను నిర్వీర్యం చేయటం దారు ణం. పెద్దపెద్ద భవన నిర్మాణాల నుంచి సెస్‌ను వసూలు చేయడం నామమాత్రంగా జరుగుతున్నది. చాలా మేరకు కట్టట్లేదు. భవననిర్మా ణ కార్మికులందరికీ వేల్పేర్ బోర్డులో సభ్యత్వం కల్పిస్తామని చెప్పిన మాట లు నీటిమీది రాతల్లాగే మిగిలాయి. అడ్డా ప్రాంతాల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను కల్పించాలనే నిబంధన బుట్టదాఖలైంది.పింఛన్ల కోసం ఆరు లక్షల మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. హక్కులను కాపాడుకోవడం కోసమే సమ్మెలోకి వెళ్తున్నాం.
- ఆర్. కోటం రాజు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బిల్డింగ్, అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్