Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఫ్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
- రెండో రోజూ సమ్మె విజయవంతం
- ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా కలెక్టరేట్లు
నవతెలంగాణ- ప్రాంతీయ ప్రతినిధులు
కార్మిక చట్టాలను రద్దు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి గోరీ కడతామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 48గంటల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం రెండవ రోజు విజయవంతమైంది. పలు జిల్లా కలెక్టరేట్ల ఎదుట కార్మికుల నిరసనలు, ధర్నాలతో హౌరెత్తాయి. జిల్లా కలెక్టరేట్ల ఎదుట, జాతీయ రహదారులపై రాస్తారోకోలు, ధర్నాలు, వంటావార్పుల్లో కార్మికులు, ఉద్యోగులు, కూలీలు, తదితరులు సమరశీలంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై తమ నిరసనను వెల్లడించారు.
హన్మకొండ జిల్లా కలెక్టరేట్‌ను కార్మిక, ఉద్యోగ సంఘాలు ముట్టడించాయి. తొలుత హన్మకొండలోని వెయ్యి స్తంభాల గుడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసీతో పాటు బ్యాంకులు, గనులు, రైల్వేలు, విమానయానం, దేశంలోని ఖనిజ సంపద.. ఇలా అన్నింటిని కారుచౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు. కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. లేనిపక్షంలో దీర్ఘకాలిక సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వరంగల్, హన్మకొండ డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, టీఆర్‌ఎస్ నాయకులు దాస్యం విజరుభాస్కర్, కుడా చైర్మెన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్ యాదవ్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చుక్కయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి ప్రభాకర్‌రెడ్డి, రాగుల రమేష్, నాయకులు టి. ఉప్పలయ్య, వీరన్న, వేల్పుల సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. వరంగల్‌లో సీఐటీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగూరి రాములు, భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రాజారావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాలను ఎండగట్టారు.
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో పలు వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి, తమ సమస్యలు పరిష్కారించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు పాల్గొని మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా కాటేదాన్ కస్టర్‌లో చేపట్టిన సమ్మెలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్బాస్ పాల్గొని కార్మికులతో ముచ్చటించారు. అనంతరం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. పరిగి పట్టణంలో సీఐటీయూ, వ్యకాస ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు.
నాగర్ కర్నూల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య పాల్గొని మాట్లాడారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల వల్ల కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందని, ఇప్పుడు కార్మిక వర్గ ఉద్యమాలతో మోడీ తలవంచక తప్పదన్నారు. కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ కార్యాలయం నుంచి నిజాంసాగర్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఆదిలాబాద్, మంచిర్యాల, కుమురంభీం- ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్కీంవర్కర్లు, రిమ్స్ ఆస్పత్రి సిబ్బంది, పారిశుద్య కార్మికులు తదితర రంగాల కార్మికులు నిరసనలో పాల్గొన్నారు. శ్రీరాంపూర్‌లో సింగరేణిలో జాతీయ సంఘాలు ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశాయి. మంచిర్యాల, కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ర్యాలీ, బహిరంగసభలో సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొని మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్ పాల్గొని నిరసన తెలిపారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు పాల సాయిరాం, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర నాయకులు విశ్వ ప్రసాద్, టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర కార్యదర్శి మంచే నర్సింహులు పాల్గొని మాట్లాడారు. కేంద్రం చేపడుతున్న ప్రజా వ్యతిరక విధానాలను ఎండగట్టారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద సీఐటీయూ, టీఆర్‌ఎస్‌కేవీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభలో చుక్క రాములు పాల్గొన్నారు. మెదక్ రాందాస్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగసభ నిర్వహించారు. సంగారెడ్డి జహీరాబాద్ మండలంలోని సత్వార గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన, గ్రామీణ బంద్ నిర్వహించారు. పటాన్‌చెరు పారిశ్రామికవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దూల్మిట్ట, జోగిపేట మండల కేంద్రాల్లో వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో మాజీ ఎంఎల్‌సీ చెరుపల్లి సీతారాములు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయలక్ష్మి, జాతీయ సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో మున్సిపల్ కార్యాలయం నుంచి కొత్తబస్టాండ్ వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులతో ఆస్పత్రి ఎదుట సమ్మె నిర్వహించారు. సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ఖమ్మం జిల్లాలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం జెడ్పీ సెంటర్‌లో వామపక్ష పార్టీలు, టీఆర్‌ఎస్ నాయకులు మానవహారం నిర్వహించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వేంసూరులో ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్మిక, ప్రజా, రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. భద్రాచలంలో నిరసన దీక్ష చేపట్టారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో చర్లపల్లి, బాలానగర్, జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. సౌత్‌జిల్లా పరిధిలో ఐఎస్ సదన్ చౌరస్తాలో ఆల్‌ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ పాల్గొని మాట్లాడారు. ప్రజలపై భారాలు మోపడం ఫలితమే రెండు రోజుల సమ్మెలో 40 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారని అన్నారు. బాలానగర్‌లోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లో హెచ్‌ఏడబ్ల్యుయూ, హెచ్‌ఏఎల్‌ఈయూ ఆధ్వర్యంలో సౌత్‌గేట్‌వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. తుర్కయంజాల్ అంబేద్కర్ చౌరస్తా నుంచి బీఎన్ రెడ్డి చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. గోల్కొండ చౌరస్తా నుంచి చిక్కడపల్లి లేబర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మల్కాజిగిరి సర్కిల్ ఆనంద్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహంవద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. పలు కంపెనీలు మూసి వేయించారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ చౌరస్తా హైదరాబాద్, వరంగల్ జాతీయ రాహదారిపై బైటాయించి ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటసేపు రహదారిని దిగ్భంధనం చేయటంతో సీఐటీయూ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. హుజూరాబాద్ పట్టణంలో తపాల ఉద్యోగులు, ఎల్‌ఐసీ ఉద్యోగులు విధులు బహిష్కరించి కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. తపాల ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. జగిత్యాల జిల్లా టీ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్, టీ ఎన్జీవోల అధ్యక్షులు భోగ శశిధర్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి ఉద్యోగులు నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు పెద్ద ఎత్తున వేలాది మందితో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు.