Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ ఎదురుగా గిరిజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ గిరిజనులకు రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లను పెంచకుండా బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. రిజర్వేషన్లు పెంచకపోవటంతో వారికి దక్కాల్సిన అనేక అవకాశాలు చేజారిపోతున్నాయని చెప్పారు. రాజ్యాంగంలోని అధికరణ 16(4) ప్రకారం గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం ఆరు నుంచి 10శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టులో కొట్టివేయకుండా రాజ్యాంగం తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చేందుకు పార్లమెంట్‌లో చట్టం చేయాలన్నారు. రాష్ట్ర శాసన సభ ఆమోదించి పంపిన తీర్మానం తమకు అందలేదంటూ కేంద్ర మంత్రి చెప్పటం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఇప్పటికే ఎనిమిదేండ్లుగా గిరిజనులు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్న 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యేలోపు గిరిజనుల రిజర్వేషన్లను పది శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధర్మ నాయక్, గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు కె. శరత్ నాయక్, సబ్బు నాయక్, మోహన్, రవీందర్ నిరాహారదీక్షకు పూనుకున్నారు.