Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు విడతల్లో నిర్మాణం
- ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌కు లింకు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్), రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్)ను అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. దాదాపు 50 రేడియల్ రోడ్లను నిర్మించాలని భావిస్తున్నది. 338 కిలోమీటర్ల ఆర్‌ఆర్‌ఆర్‌ను, 158 కిలోమీటర్ల నిడివి ఉన్న ఓఆర్‌ఆర్‌తో అనుసంధానిస్తే రవాణా సులభంగా మారుతుందని రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ రెండింటిని కలిపే రేడియల్ రోడ్లు ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌కు లింకురోడ్లుగా ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే హెచ్‌ఎండీఏ నుంచి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) కోరగా, ఉన్నతాధికారులు ఇప్పుడా ఆ పనిలో నిమగమయ్యారు. రెండు విడతల్లో రేడియల్ రోడ్ల నిర్మాణం జరగనుంది. ఇందుకు దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా. అయితే డీపీఆర్ రూపొందించిన తర్వాతే వ్యయంపై పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ, రోడ్లు-భవనాలు, హెచ్‌ఎండీఏ శాఖలకు సంయుక్తంగా ఈ రేడియల్ రోడ్ల నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. అవుటర్ రింగు రోడ్డు కోసం నిర్మించిన ఏడు రేడియల్ రోడ్ల తరహాలోనే వీటినీ నిర్మిస్తారని సమాచారం. ఈ రేడియల్ రోడ్లు సంగారెడ్డి- నర్సాపూర్- తూప్రాన్- గజ్వేల్- జగదేవ్‌పూర్- భువనగిరి- చౌటుప్పల్- ఆమన్‌గల్- యాచారం- కందుకూరు- షాద్‌నగర్- చేవెళ్ల- కంది ప్రాంతాలకు అనుసంధానంగా ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లో ఈ రేడియల్ నిర్మితం కానున్నాయి. హైదరాబాద్ నగరానికి రేడియల్ రోడ్ల మూలంగా మెరుగైన రవాణా సదుపాయం ఏర్పడనుంది. అలాగే స్థానికంగానూ ప్రయోజనం కలగనుంది.