Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రయివేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయనే విషయాన్ని పరిశీలించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ఆదేశించారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నఆశాలు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీ వైద్యులు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, డీఎంహెచ్‌వోలతో మంత్రి హరీశ్‌రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీహెచ్ శ్రీనివాస రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో సబ్ సెంటర్, పీహెచ్‌సీ ల వారీగా పురోగతిని మంత్రి సమీక్షించారు. ఆశా, ఏఎన్‌ఎం,మెడికల్ ఆఫీసర్లతో మంత్రి మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయివేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య సూచీలో ఇప్పటికే తమిళనాడును అధిగమించామంటూ దేశంలోనే మొదటి స్థానం వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో మెరుగైన పనితీరు కనబరిచే వారికి తగిన రీతిలో గుర్తింపునిస్తామనీ, అదే సమయంలో పని చేయని వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ నెల ఏడున ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని నగదు ప్రోత్సాహంతో సన్మానిస్తామనీ, ఇందుకోసం ప్రతి విభాగం నుంచి ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వాస్పత్రుల్లో జరిగే సిజేరియన్లపై గైనకాలజిస్టుల వారీగా పరిశీలన నిర్వహిస్తామనీ, ఇక నుంచి ప్రతి నెల అన్ని విషయాలపై సమీక్ష ఉంటుందనీ, ప్రతి ఒక్కరు రిపోర్టుతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ వారానికి ఒక జిల్లాకు వచ్చి, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం జాతీయ ఆరోగ్య మిషన్‌పై సమీక్షించారు. జిల్లాల్లోని వివిధ పట్టణాల్లో ఏర్పాటు చేసే బస్తీ దవాఖానల పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.