Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలానికో ఎడ్యుకేషన్ హబ్ కావాలి
- సోషల్ డెమోక్రటిక్ ఫోరం రాష్ట్ర కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి
నవతెలంగాణ-గజ్వేల్/ జగదేవపూర్
ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ పట్టణంలో నిర్మించిన ఎడ్యుకేషన్ హబ్‌లను రాష్ట్రమంతా మండలానికొకటి నిర్మించి.. విద్యాభివృద్ధికి కృషి చేయాలని సోషల్ డెమోక్రటిక్ ఫోరం రాష్ట్ర కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. ఎస్‌డీఎఫ్ చేపట్టిన బడి నిద్రలో భాగంగా ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని బార్సు ఎడ్యుకేషన్ హబ్‌లో గల బాలుర ఉన్నత పాఠశాలను, సంగుపల్లి ప్రాథమిక పాఠశాలను, జగదేవపూర్ మండలం తీగుల్ ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు. తీగుల్ పాఠశాలలో 228 మంది పిల్లలు చదువుతున్నప్పటికీ.. నలుగురే ఉపాధ్యాయులు ఉన్నారని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తరగతి గదులు శిథిలావస్థకు చేరి కూలిపోయేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రహరీ కుంగిపొయిందని వివరించారు. పిల్లలు కింద కూర్చొని చదువుకోవాల్సిన పరిస్ధితి నెలకొన్నదన్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. దాతలపై ఆధారపడటం కాకుండా ప్రభుత్వమే నిధులు కేటాయించి పాఠశాలలను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ను సవరించి రూ.10 వేల కోట్ల నిధులను మన ఊరు- మన బడి పథకానికి కేటాయించాలన్నారు. మూడు నాలుగు సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యా బోధన చేపట్టి వారిలో సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. ఆయన వెంట ప్రొఫెసర్ కె.లక్ష్మి నారయణ, డాక్టర్ ప్రధ్వీరాజ్, పి.శంకర్, జస్వంత్ రెడ్డి స్వరూప, పులి కల్పన అంసొల్ లక్ష్మణ్, రాచకొండ వెంకన్న, దాసరి ఎగొండ స్వామి, బ్యాగరి వేణు, సతీష్, కిరణ్ ఉన్నారు.