Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టు ధిక్కార కేసులో విచారణ ముగింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సిద్దిపేట మాజీ కలెక్టర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై దాఖలైన కోర్టు ధిక్కార కేసు విచారణను హైకోర్టు మూసివేసింది. దీంతో ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. వరి సాగు చేయరాదనీ, వరి విత్తనాలు విక్రయించిన వారిపై తీవ్ర చర్యలుంటాయనీ, సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆదేశించినా లెక్కచేయబోనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను హైకోర్టు సుమోటో కోర్టుధిక్కార కేసుగా పరిగణించి సోమవారం విచారణ జరిపింది. వెంకట్రామ్‌రెడ్డి క్షమాపణలు చెప్పడంతో కేసును మూసివేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణను ముగించింది. తను చేసిన వ్యాఖ్యలపై వెంకట్రామిరెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పినందున ఆయన్ను క్షమించి కోర్టుధిక్కరణ వ్యాజ్యంపై విచారణను ముగించాలన్న ఏజీ అభ్యర్థనను డివిజన్ బెంచ్ పరిగణనలోకి తీసుకుంది.
క్యాడర్ కేటాయింపు చట్ట వ్యతిరేకం :హైకోర్టులో సీఎస్
తెలంగాణ ఏర్పాటు సమయంలో ఉమ్మడి ఏపీలో పనిచేసే కేంద్ర సర్వీస్ అధికారుల క్యాడర్ల కేటాయింపులకు ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇచ్చిన మార్గదర్శలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ వ్యతిరేకించారు. కేంద్ర సర్వీస్ అధికారుల చట్ట నిబంధనలను ఉల్లంఘించే విధంగా మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. అందుకే 16 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) ఉత్తర్వులు ఇచ్చిందనీ, వీటి విషయంలో హైకోర్టు జోక్యానికి ఆస్కారం లేదని చెప్పారు.