Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగాన్ని, వ్యవస్థలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంలో వివాదమేమీ లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పాడి కౌశిక్‌రెడ్డి పేరు సేవారంగం నుంచి ప్రతిపాదించిందనీ, సదరు వ్యక్తి ఎలాంటి సేవా చేయలేదని తాను భావించినట్టు తెలిపారు. అందుకే తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పానని వివరించారు. ప్రొటోకాల్ పాటించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు ప్రొటోకాల్ గురించి తెలియదా? అని ప్రశ్నించారు. వ్యక్తిని కాకుండా వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బుధవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో గవర్నర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను, ప్రధానంగా ప్రొటోకాల్ వివాదంపై మోడీ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. తనపై తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా గవర్నర్‌ను అవమానిస్తున్నదన్నారు. వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తాననీ, కానీ రాజ్యాంగపరంగా గవర్నర్ కార్యాలయానికి మర్యాద ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు అభినందించానన్నారు. చేయాల్సిన విషయాలపై ప్రభుత్వానికి సూచనలూ చేసినట్టు తెలిపారు. తెలంగాణలో ఆస్పత్రులు బాగు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వరంగల్ ఆస్పత్రిలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తాను ఏ విషయాల్లో రాజకీయాలు చేశానో బయటపెట్టాలని సూచించారు. సీఎం ఏ విషయాన్నైనా తనతో నేరుగా వచ్చి చర్చించవచ్చనన్నారు. రాజ్‌భవన్‌కు సీఎం, మంత్రులు ఎప్పుడైనా రావొచ్చని చెప్పారు. ఎవరైనా సమస్యలను తన దృష్టికి తీసుకురావొచ్చని చెప్పారు. తనను ఎవరూ అవమానించలేదనీ, తనకెంలాంటి ఇగోలు లేవని వ్యాఖ్యానించారు. తాను వివాదాస్పద వ్యక్తిని కానందున, వివాదాలను కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేసేందుకు తాను ప్రధాని మోడీని కలవలేదన్నారు. ప్రజలు, ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలనేదే తన ఉద్దేశమని వివరించారు. తెలంగాణ ప్రజలంటే తనకు ఎంతో ఇష్టమనీ, రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలని ప్రధానిని కోరినట్టు తెలిపారు. ప్రజాసంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రధాని దిశానిర్దేశం చేశారన్నారు. మరోవైపు తెలంగాణలో గిరిజనుల సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. రాష్ట్రంలో 11 శాతం గిరిజన జనాభా ఉందనీ, వాళ్ల సమస్యలపై తాను దృష్టి పెట్టిన విషయాన్ని మోడీకి వివరించానని తెలిపారు. ఇటీవల గిరిజన ప్రాంతాల పర్యటనల్లో సమస్యల పరిష్కారానికి చేసిన కృషిని ప్రధానికి వివరించినట్టు చెప్పారు. దీంతోపాటు తెలంగాణ, పుదుచ్చేరి మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని కోరగా కేంద్రం వెంటనే ప్రారంభించిందన్నారు. గిరిజన గ్రామాలను దత్తత తీసుకోవడం, ఆ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించానన్నారు.