Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టాల పేరుతో బస్సుల కుదింపు
- 12 ఎక్స్‌ప్రెస్ బస్సులుండగా.. ఐదింటిని ఇతర డిపోలకు అటాచ్
- ఆందోళనలో కార్మికులు, ప్రయాణికులు
నవతెలంగాణ-గజ్వేల్
ప్రజారవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీని నష్టాల పేరుతో క్రమంగా ప్రభుత్వం కుదించేస్తోంది.. బస్ డిపోలను ఎత్తేసేందుకు రంగం సిద్ధం చేసింది. పైకి ఏమీ చెప్పకుండా.. లోలోన బస్సుల కుదింపు.. ఇతర డిపోలకు తరలింపు వంటి చర్యలు చేపట్టింది. మొత్తం తరలింపు పూర్తయ్యాక డిపోను పూర్తిగా ఎత్తేస్తారు. అందులో భాగంగానే గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోను ఎత్తేయడానికి రంగం సిద్ధమవుతోంది. డిపో యాజమాన్యం ఇప్పటికే ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని బస్సులను ఇతర డిపోలకు అటాచ్ చేస్తున్నారు. ప్రస్తుతం డిపోలో 70 బస్సులుండగా 30 వరకు తగ్గించాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ డిపోను ఎత్తేస్తే 177 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిపోను ఎత్తేయొద్దని స్థానికులు కోరుతున్నారు.
1993-94లో సిద్దిపేట జిల్లాలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మంత్రి గీతారెడ్డి ఏర్పాటు చేశారు. మొదటగా 25 బస్సులతో ఈ బస్ డిపోను ప్రారంభించారు. ప్రస్తుతం 300 పైగా కార్మికులు పనిచేస్తుండగా.. 70 బస్సులతో డిపో కొనసాగుతుంది. అయితే నష్టాల పేరుతో కుదింపు చర్యలకు అధికారులు యత్నిస్తున్నారు. 12 ఎక్స్‌ప్రెస్ బస్సులుండగా అందులో ఐదింటిని ఇప్పటికే ఇతర డిపోకు అటాచ్ చేశారు. ఒకవేళ ఈ డిపో ఎత్తేస్తే గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న 177 గ్రామాలకు పూర్తిస్థాయిలో బస్సు సౌకర్యం లేకుండా పోతుంది. గ్రామానికి ఒక్క బస్సు కూడా వచ్చే అవకాశం ఉండదు. ప్రత్యేకంగా విద్యార్థుల కోసమే ఇక్కడ పలు రూట్లల్లో బస్సులు నడుస్తున్నాయి. డిపోను ఎత్తేస్తే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతారు. ప్రయివేటు వాహనాలపైనే ఆధారపడుతారు. పేద విద్యార్థులపై ఇది తీవ్ర భారం కానున్నది. ఈ డిపో నుంచి పెద్ద రూట్‌లకు బస్సు నడకపోవడంతో నష్టాలు వస్తున్నాయని కార్మికులు, ప్రజలు, ప్రయాణీకులు చెబుతున్నారు. నష్టాల నుంచి బయటికి వచ్చే ప్రయత్నాలు చేయాలి కానీ.. డిపో ఎత్తివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మెన్ ప్రతాప్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని డిపోను ఎత్తి వేయకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను వెంటనే విరమింపజేసి.. లాభాలు వచ్చే రూట్లలో బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
డిపోను రక్షించుకుంటాం
స్థానిక పాలకులు స్పందించి ముందుకు రావాలి. ప్రజల కోసం ఏర్పాటు చేసిన గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపోను నష్టాల పేరిట ఎత్తేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. అదే జరిగితే చూస్తూ ఊరుకునేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిపోను కాపాడుకుంటాం.
- సర్దార్ ఖాన్- కాంగ్రెస్ నాయకులు
డిపోను ఎత్తేస్తే ఆందోళన తప్పదు
డిపోను ఎత్తివేసేందుకు యత్నిస్తే ప్రజలు, కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం డిపో ఎత్తివేతపై వెనుక్కు తగ్గాలి. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అనేక గ్రామాలకు బస్సులు లేవు. బస్సులను కేటాయించేది పోయి.. డిపోనే ఎత్తేసేందుకు రంగం సిద్ధం చేయడం విడ్డూరంగా ఉంది. ఈ విషయంలో మున్సిపల్ పాలకవర్గం స్పందించాలి.
ఎల్లయ్య- సీఐటీయూ నాయకులు