Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో టీఆర్‌ఎస్ ధర్నా.. పట్నంలో బీజేపీ దీక్ష
- ధాన్యం అమ్మేందుకు అన్నదాతల ఇక్కట్లు
- దళారుల తీవ్ర దోపిడీ
- క్వింటాకు రూ.300 నుంచి 600 దాకా నష్టం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల పరస్పర విమర్శలు... లేఖాస్త్రాలు.. పోటాపోటీ దీక్షలు...ధర్నాలు.. అన్నదాతల ఆర్తనాదాలు...మిల్లర్లు, దళారుల విచ్చలవిడీ దోపిడీ. ఇదీ రాష్ట్రంలోని పరిస్థితి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆ రెండు పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడతో, మిల్లర్ల దోపిడీతో అంతిమంగా సమిధలవుతున్నది అన్నదాతలే. ఢిల్లీలో టీఆర్‌ఎస్ హడావిడిగా, మొక్కుబడిగా ధర్నా చేసినా...హైదరాబాద్‌లో ఇందిరాపార్కు వద్ద పోటీగా బీజేపీ దీక్ష చేసినా ఉద్వేగపూరిత ప్రసంగాలు, నిందారోపణలు తప్ప రైతులకు భరోసా కల్పించింది శూన్యమే. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆధిపత్యం కోసం జరుగుతున్న రాజకీయ కొట్లాటే అన్న విమర్శ వస్తున్నది. ఆరుగాలం కష్టపడి రైతన్న పండించిన పంటకు క్షేత్రస్థాయిలో కనీసమద్దతు ధర రూ.1960 ఎక్కడా దక్కట్లేదు. 'రాజకీయంగా మీరు తన్నుకు చావండి.. యథేచ్ఛగా మా దోపిడీ మేం చేసుకుంటాం' అన్నట్టుగా మిల్లర్లు, దళారులు వ్యవహరిస్తున్నారు. భలే ఛాన్స్ దొరికిందిరయ్యా అని రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని క్వింటా రూ. 300 నుంచి రూ.600 దాకా దోచుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలోనైతే మిల్లర్లు రూ. 1250కే క్వింటా ధాన్యం కొనుగోలు చేసిన దుస్థితి. మిగతా జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఉప్పుడు బియ్యం కాకుండా బియ్యం ఇస్తే రైతులకు నష్టం జరుగుతుందని రాష్ట్ర సర్కారు వాదిస్తూ వస్తున్నది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో రాని ఇబ్బంది తెలంగాణలోనే ఎందుకొస్తుందని బీజేపీ నేతలు ప్రతివాదన చేస్తూ పోతున్నారు. దీనికితోడు ఉప్పుడు బియ్యం కాకుండా వడ్లను బియ్యం మారిస్తే నూక వస్తుందనీ, ఆ నష్టం కింద మిల్లర్లకు క్వింటాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.300 నుంచి 400 ఇస్తే సరిపోతుందని బీజేపీ చెబుతున్నది. రూ.1000 కోట్ల నుంచి రూ.1200 కోట్లు (సుమారు ఒక్కో రైతు మీద రూ.1800)ఖర్చుపెడితే రైతుల నుంచి మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయవచ్చని ప్రచారం చేస్తున్నది. దీనికితోడు మోడీ సర్కారు ఒక్కో ఎకరం మీద రూ.65 వేలు ఖర్చుపెడుతున్నదని బండి సంజరు మాట్లాడిన దాంట్లో ఎంతమేరకు వాస్తవం ఉందో లబ్దిపొందిన రైతులకే తెలియాలి. తాము ప్రత్నామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తే రైతులను వరి సాగుచేసేలా బీజేపీ నేతలు రెచ్చగొట్టారని టీఆర్‌ఎస్ వాదిస్తున్నది. సీఎం, మంత్రుల మాటలు పట్టించుకోవద్దనీ, రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేయించే బాధ్యత తమదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ గొప్పలకు పోయారు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలనీ, పంజాబ్, తెలంగాణలో ఒకలా కాకుండా దేశమంతటా ఒకే విధమైన ధాన్యం సేకరణ జరగాలనే డిమాండ్‌ను టీఆర్‌ఎస్ ఎత్తుకున్నది. బీజేపీ నేతలేమో రాష్ట్రం వడ్లు కొనుగోలు చేసి రైస్‌గా మార్చి ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉందని ఇప్పుడు మాట్లాడుతున్నారు. బియ్యంగా పట్టిస్తే మీరే కొనాలా? అది గొప్ప అవుతుందా? అని రాష్ట్ర సర్కారు వాదిస్తూ వస్తున్నది. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న రాజకీయ క్రీడలో అన్నదాతలు బలిపశువులు అవుతున్నారు.
రైతుల చేతుల నుంచి మిల్లర్లు, బ్రోకర్ల చేతుల్లోకి ఇప్పటికే కొంత మేర ధాన్యం వెళ్లిపోయంది. అన్నదాతలకు నష్టం వాటిల్లకుండా త్వరితంగా కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటే మంచింది. ఇలాగే తాత్సారం చేస్తూ పోతే రైతుల కోర్టులో బీజేపీ, టీఆర్‌ఎస్ సర్కారులు దోషులగా నిలబడాల్సి వస్తుంది. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర సర్కారు సానుకూల నిర్ణయం తీసుకుని వివాదానికి చెక్‌పెడుతుందా? కేంద్రం కొంటలేదు కాబట్టి ఇక మేమే అన్నదాతలకు అండగా ఉంటాం..ధాన్యం కొనుగోలు చేస్తాం అన్న హామీ ఇస్తుందా? అన్న దానిపై క్లారిటీ రావాలంటే మంగళవారం జరిగే క్యాబినెట్ సమావేశం దాకా వేచిచూడాల్సిందే.