Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగు నీరు లేక.. పంటలు పండక మిగిలిన అప్పులు
నవతెలంగాణ-దౌల్తాబాద్ / రాయపర్తి
వ్యవసాయాన్నే నమ్ముకున్న బతుకు అవి.. వడ్లగింజ పండందే డొక్క నిండని జీవితాలవి.. బోర్లు వేస్తే చుక్క నీరు పడకపోవడం.. నీరు లేక పంట దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఇద్దరు రైతులు ప్రాణం తీసుకున్నారు. ఈ ఘటనలు సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో జరిగాయి. వివరాలిలా ఉన్నాయి..
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లికి చెందిన బొల్లం అశోక్(46) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. నీటి వసతి కోసం గతంలో రెండు బోర్లు వేయగా.. చుక్క నీరు పడలేదు. దీంతో పంటలు సరిగా పండక దిగుబడి రాలేదు. పెట్టుబడికి, బోర్ల కోసం చేసిన అప్పులు నానాటికీ పెరుగుతుండటంతో అశోక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పొలం దగ్గరి నుంచి ఇంటికి వచ్చి.. పక్కనే శిథిలావస్థలో ఉన్న ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. రైతు భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చైతన్య కుమార్‌రెడ్డి తెలిపారు.
యువ రైతు ప్రాణం తీసిన సాగునీరు
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొలనుపల్లి గ్రామానికి చెందిన కాడబోయిన రాజ్ కుమార్(30) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన మూడెకరాల వ్యవసాయ భూమిలో బోరు బావి నీటి వసతి ఉండగా వరి సాగు చేశాడు. బోరు బావిలో నీరు అడుగంటగా రెండెకరాల పొలం పూర్తిగా ఎండిపోయింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఆదివారం వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగాడు. స్థానిక రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. రైతుకు తల్లిదండ్రులు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం భార్య గర్భవతి. తండ్రి మలయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బండారి రాజు తెలిపారు.