Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ ఆవిర్భావ సభలో సారంపల్లి, సాగర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టం కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహిం చాల్సిన తప్పనిసరి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఏఐకేఎస్ 87వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఆ సంఘ రాష్ట్ర కార్యాలయంలో మల్లారెడ్డి సోమవారం జెండా అవిష్కరించారు. అనంతరం సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి లెల్లల బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ మాట్లాడారు. 1936 ఏప్రిల్ 11న ఆవిర్భవించిన ఏఐకెేఎస్ రైతాంగ సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించిందన్నారు. బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించిందని చెప్పారు. స్వామి సహజానంద సరస్వతి నాయకత్వంలో దేశ వ్యాప్త రైతాంగ ఉద్యమాలు నిర్వహించిందన్నారు. స్వాతంత్య్రానంతరం భూ సంస్కరణలు అమలు చేయాలనీ, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించిందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పోరాడి విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. కనీస మద్దతు ధరల చట్టం చేయాలనీ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలనీ, రుణ విమోచన చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 17 వరకు ఆందోళనలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ్యవసాయ మార్కెట్లు సందర్శించి కనీస మద్దతు ధరల అమలుపై పోరాటాలు నిర్వహించాలని కోరారు.
నాలుగు లేబర్ కోడ్‌లు, మతతత్వం, సామాజిక దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఏప్రిల్ 17 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జండా ఆవిష్కరణలు, సభలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనల్లో రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు కలిసి రావాలని కోరారు. వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను దగాచేసిన ఏ ప్రభుత్వమైనా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, వృత్తి సంఘాల నాయకులు గణేష్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.