Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తు చేసుకోని వేలాది మంది మనోవేదన
- గడువు పెంచాలంటూ ప్రభుత్వానికి వేడుకోలు
- సవరించే అవకాశమివ్వని అధికారులు
- విద్యాశాఖ తీరుపై ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'మూడు రోజుల నుంచి టెట్ సర్వర్ డౌన్ అయ్యింది. అందుకే సకాలంలో ఫీజు చెల్లించలేకపోయాను. దాని వల్ల దరఖాస్తు చేయలేదు. ప్రభుత్వం మానవత్వంతో అర్థం చేసుకుని దరఖాస్తు గడువును పొడిగించాలి'అంటూ ఆదిలాబాద్‌కు చెందిన ఓ అభ్యర్థి నవతెలంగాణతో వాపోయారు.
'ఈనెల 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు అవకాశమున్నది. అయితే ఫీజు చెల్లింపు, దరఖాస్తు ఒకేసారి చేస్తే సరిపోతుందని నేను భావించాను. కానీ ఈనెల 11వ తేదీ వరకే ఫీజు చెల్లింపునకు గడువుందని తెలియదు. అందువల్ల దరఖాస్తు చేయలేదు. టెట్‌కు దరఖాస్తు చేయకపోతే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసే అవకాశముండదు. అధికారులు స్పందించి మరోసారి దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించాలి.'అంటూ నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మరో అభ్యర్థి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలా రాష్ట్రంలో వేలాది మంది అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు వివిధ కారణాలతో దరఖాస్తు చేయకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారు. తమ బతుకులు ఆగమవుతాయనీ, దరఖాస్తు చేసేందుకు గడువు పొడిగించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. టెట్‌కు దరఖాస్తు చేసే గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ సేవలు సరిగ్గా అందుబాటులో లేకపోవడం, సర్వర్ డౌన్ కావడం, ఆర్థిక, ఇతర సమస్యల కారణంగా సకాలంలో దరఖాస్తు చేయలేకపోయామని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. ఇంకోవైపు చాలా మంది పరీక్ష ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమర్పణ ప్రక్రియను చివరిరోజు చేయాలని భావించారు. కానీ దరఖాస్తు సమర్పణకు ఒక రోజు ముందే ఫీజు గడువు ముగియడంతో ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు గడువును పెంచకపోవడం పట్ల విద్యాశాఖ అధికారుల తీరుపట్ల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అభ్యర్థుల మనోభావాలను అర్థం చేసుకుని టెట్ దరఖాస్తు గడువును పొడిగించాలంటూ డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాలు కోరుతున్నాయి.
భవిత ప్రశ్నార్ధకం
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే టెట్‌లో తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉన్నది. అందుకే టెట్‌కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అభ్యర్థులు ఎక్కువ మంది రాసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే టెట్‌ను తెలంగాణలో చివరిసారిగా 2017, జులైలో నిర్వహించారు. సుమారు ఐదేండ్ల తర్వాత మళ్లీ టెట్‌ను నిర్వహిస్తున్నారు. అయితే గతనెల 24న టెట్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) జారీ చేసింది. గతనెల 26వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు ఈనెల 12వ తేదీ వరకు కల్పించింది. ఇక ఫీజు చెల్లింపునకు మార్చి 26 నుంచి ఈనెల 11వ తేదీ వరకు అవకాశమిచ్చింది. అంటే ఫీజు చెల్లింపునకు 17 రోజులు, దరఖాస్తు చేసేందుకు 18 రోజులు మాత్రమే గడువు ఇచ్చింది. దీంతో అభ్యర్థులు సకాలంలో ఫీజు చెల్లించడంతోపాటు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇంకోవైపు దరఖాస్తుల్లో లోపాలు, తప్పులుంటే సవరణ చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించకపోవడం పట్ల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరును తప్పుపడుతున్నారు. దీంతో అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జేఈఈ, నీట్ సహా ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లోనూ ఆలస్య రుసుంతోపాటు, దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశముంటుంది. కానీ టెట్ అధికారులు అలాంటి అవకాశం కల్పించకపోవడం గమనార్హం. ఇంకోవైపు దరఖాస్తుల్లో తప్పులుంటే హాల్‌టికెట్ జారీ చేయబోమనీ, పరీక్షలకు అనుమతివ్వబోమంటూ చెప్పడం దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్య రుసుంతోనైనా దరఖాస్తులు స్వీకరించాలని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తప్పులుంటే హాల్‌టికెట్లు ఇవ్వబోమనడం సరికాదు : రామ్మోహన్‌రెడ్డి
టెట్ దరఖాస్తుల్లో తప్పులుంటే సవరించేందుకు అవకాశం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా అభ్యర్థులకు హాల్‌టికెట్లు ఇవ్వబోమంటూ ప్రచారం చేయడం సరైంది కాదని తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. సవరణ అవకాశం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అభ్యర్థులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. హాల్‌టికెట్ రాకుంటే అభ్యర్థుల భవిష్యత్ ఏమవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
టెట్ దరఖాస్తు గడువును పొడిగించాలి :
ఆర్‌ఎల్ మూర్తి
టెట్ దరఖాస్తు గడువును పొడిగించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్ మూర్తి డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా టెట్ వెబ్‌సైట్ సర్వర్ డౌన్ కావడంతో అభ్యర్థులు ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణకు ఇబ్బంది పడ్డారని తెలిపారు. దరఖాస్తు చేసేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. అభ్యర్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని మరో వారం రోజులపాటు దరఖాస్తు గడువును పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
టెట్‌కు 6.29 లక్షల దరఖాస్తులు
టెట్‌కు అభ్యర్థుల నుంచి భారీ స్పందన వచ్చింది. రికార్డుస్థాయిలో 6,29,352 దరఖాస్తులొచ్చాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా, పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ పేపర్-1కు 3,51,468, పేపర్-2కు 2,77,884 కలిపి మొత్తం 6,29,352 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. టెట్‌కు 3,80,589 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు.