Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 ఏండ్లుగా ఇంటి స్థలాలివ్వని సర్కార్
- డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇంకెప్పుడిస్తారు?: పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవ తెలంగాణ - బోనకల్
ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి ఢిల్లీకెళ్లి రైతు దీక్ష చేయనున్నామని టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుతో వెళ్లి ప్రగల్భాలు పలికిన సీఎం కేసీఆర్.. చివరకు కేంద్రం ముందు తన మెడలు వంచి దిక్కులేని వాడిలా తిరిగి వచ్చారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో శుక్రవారం గోవిందాపురం ఏ, మోటమర్రి గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వారు ఇచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. ఇంటి స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని పెద్ద మొత్తంలో ప్రజల నుంచి దరఖాస్తులు వచ్చాయి. అనంతరం జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ ఏనిమిదేండ్లలో నిరుపేదలు గూడు నిర్మించుకునేందుకు ఇంటి స్థలాలు పంపిణీ చేయకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. బోనకల్ మండలం గోవిందపురం (ఏ) గ్రామం నుంచి మోటమర్రి గ్రామానికి పంట పొలాలకు వెళ్ళడానికి రహదారి నిర్మించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకి గోవిందపురం (ఏ) రైతులు విజ్ఞప్తి చేశారు. గోవిందపురం చెరువు కట్ట నుంచి మోటమర్రి గ్రామానికి పాదయాత్రగా వస్తుండగా రైతులు ఎదురొచ్చి తమ సమస్యలను వివరించారు. వర్షాకాలం వస్తే ఈ రహదారి గుండా నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం మూడేండ్ల కిందటే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ కరోనా సాకుతో నిధులు ఇవ్వలేదని రైతులకు భట్టి వివరించారు.