Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహకార విస్తరణ ప్రణాళికపై చర్చ
- గీతం కోర్సుల నిర్వహణ తీరుపై ప్రశంసలు
నవ తెలంగాణ - పటాన్‌చెరు
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీలో అంతర్జాతీయ అసోసియేట్ డీన్ తిమిటీ జె.లించ్ నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యుల బృందం శుక్రవారం హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ నేతృత్వంలో గీతం సైన్స్ డీన్ ఎం.బాలకుమార్, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, భౌతిక, రసాయన శాస్త్ర విభాగాధిపతులు ప్రొఫెసర్ రావూరి బాలాజీరావు, డాక్టర్ సురేంద్రబాబు, బీఎస్సీ బ్లెండెడ్ సమన్వయకర్తలు డాక్టర్ సాయిప్రీతి, డాక్టర్ శ్రీమన్నారాయణ, పలువురు అధ్యాపకులు వారితో ముఖాముఖి చర్చించారు. ముఖ్యంగా మెల్బోర్న్ విశ్వవిద్యాలయ సహకారంతో మూడేండ్ల కిందట ప్రారంభించిన బీఎస్సీ బ్లెండెడ్ కోర్సును సమీక్షించడంతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని అధిగమించాల్సిన తీరు వంటి వాటిపై ప్రధానంగా చర్చించారు. విద్యార్థులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తాము చేసిన పరిశోధనలను ఆస్ట్రేలియా బృందానికి వివరించి, వారి ప్రశంసలందుకున్నారు. గీతం కోర్సుల నిర్వహణ తీరు తమకు చాలా నచ్చిందని, భారతదేశంలో ఏడు చోట్ల బీఎస్సీ బ్లెండెడ్ కోర్సుకు అనుమతివ్వగా, పూణే వర్సిటీతో పాటు గీతం పనితీరు, అధ్యాపకుల నిబద్ధత, విద్యార్థుల పురోగతి తమను ఆకట్టుకున్నట్టు ఆస్ట్రేలియా బృందం అభిప్రాయపడింది. త్వరలో డ్యూయల్ డిగ్రీ లేదా డబుల్ డిగ్రీ కోర్సును ప్రారంభిస్తామని, అది రెండేండ్లు గీతం, చివరి రెండేండ్లు మెల్బోర్న్‌లో పూర్తిచేయొచ్చని వారు చెప్పారు. అలాగే పలు పరిశోధనా (పీహెచ్‌డీ) కోర్సులను కూడా భారతీయ విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా మలుస్తున్నామన్నారు. ఆయా సైన్స్ కోర్సులను చదివినవారు లోతుగా, సృజనాత్మకంగా ఆలోచించి, సమస్యలకు తగిన పరిష్కారాలు చూపాలనేదే తమ అభిమతమని చెప్పారు. భారతీయ విద్యార్థులు సొంత డబ్బుతో కాకుండా, కొద్దిపాటి మొత్తంతోనే ఆస్ట్రేలియా వచ్చి చదువుకోవచ్చని, 20 శాతం సమయాన్ని పార్ట్ టైమ్ ఉద్యోగాల కోసం వెచ్చించవచ్చని, చదువుకుంటూనే సంపాదించి సొంత కాళ్ళపై నిలబడేలా ప్రోత్సహిస్తున్నా మన్నారు. పూణే విశ్వవిద్యాలయం పూర్వ ప్రొఫెసర్ మాధవరావు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.