Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొండెం చెరువు రిజర్వాయర్ ఎత్తు పెంచొద్దు
- పనులు అడ్డుకున్న పేదలు
- ఎత్తుపెంచడం సరికాదు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-మంచిప్ప/కంఠేశ్వర్
రైతులను ముంచే ప్రాజెక్టులు మాకొద్దని నిర్వాసితులు నినదించారు. రీ డిజైన్ పేరుతో కొండెం చెరువు రిజర్వాయర్ ఎత్తు పెంచడంతో తాము పూర్తిగా నష్టపోతున్నామని, పాత డిజైన్ ప్రకారమే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా మంచిప్ప మండలం అమ్రాబాద్‌లో శుక్రవారం మంచిప్ప రిజర్వాయర్ భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంచిప్ప, ఆమ్రాబాద్, బైరాపూర్ గ్రామ భూ నిర్వాసితులు సమావేశం నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి పనులను అడ్డుకున్నారు. మూడు గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఎత్తు పెంపుపై స్పష్టత వచ్చే వరకూ పనులు చేపట్టొద్దని డిమాండ్ చేస్తూ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాళేశ్వరం 21, 22 ప్యాకేజీలో ప్రాజెక్టు సామర్థ్యంపై స్పష్టత వచ్చేంత వరకూ 22వ ప్యాకేజీలో నడుస్తున్న పనులను ఆపాలని డిమాండ్ చేశారు. పాత డిజైన్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్‌తో కొండెం చెరువులో 0.5 టీఎంసీ నీటిని నింపి 1,83,000 ఎకరాలకు సాగునీటిని ఇస్తామని గతంలో ప్రకటించారని, మళ్లీ రీ డిజైన్ పేరుతో 3.5 టీఎంసీలకు రిజర్వాయర్ సామర్థ్యం పెంచుతున్నట్టు ప్రకటించడం సరికాదని అన్నారు. రీ డిజైన్‌తో కేవలం 14,000 ఎకరాలకు అదనంగా సాగునీరు అందనుందని, కానీ మంచిప్పతో పాటు మరో మూడు గ్రామ పంచాయతీలు, ఆరు తండాల్లోని వేలాది కుటుంబాలు నిర్వాసితులవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత డిజైన్ ప్రకారమే పనులు చేపట్టాలని, ప్రాజెక్టు సామర్థ్యంపై స్పష్టత వచ్చే వరకూ పనులు చేపట్టొద్దని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మంచిప్ప సర్పంచ్ సిద్ధార్థ్, అమ్రాబాద్ ఉపసర్పంచ్ ప్రేమ్, మాజీ సర్పంచ్ ఈశ్వర్ సింగ్ నాయక్, తండా నాయకులు చప్లా నాయక్, దేవి నాయక్, రాయ చంద్ నాయక్, మంక్తు, ముంపు గ్రామాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎత్తుపెంచడం సరికాదు : సీపీఐ(ఎం)
పేద గిరిజనుల నుంచి రాజకీయ స్వలాభం కోసం మంచి ప్రాజెక్టు ఎత్తు పెంచడం సరికాదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు అన్నారు. ముంపు బాధితుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అవసరం లేకున్నా, రాజకీయ స్వలాభం కోసం కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనం కోసం మంచిప్ప రిజర్వాయర్ ఎత్తు పెంచుతున్నారని విమర్శించారు. గ్రామస్థుల అంగీకారం లేకుండా గ్రామ సభ తీర్మానాలు లేకుండా పనులు మొదలు పెట్టడం పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక దశాబ్దాల నుంచి ఆయా గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులు తమ ఉపాధి పోవటంతో పాటు భూములు, ఇండ్లు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అంగీకారం లేకుండా రీడిజైన్ పేరుతో వందలాది కుటుంబాలను భూ నిర్వాసితులను చేయటం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మంచిప్ప రిజర్వాయర్ భూ పోరాట కమిటీ నిర్వహించే పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. అనంతరం నిర్వాసితులతో కలిసి పనులను అడ్డుకున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి. వెంకటేష్, భూ నిర్వాసితుల కమిటీ నాయకులు శంకర్, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.