Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూసివేత దిశగా సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కు
- 70 యూనిట్లలో ఇప్పటికే 10 యూనిట్లు మూసివేత
- పాత ఇనుపసామాను కింద 300 మరమగ్గాల అమ్మకం
- పెరిగిన నూలు ధర.. మార్కెట్‌లోనేమో తగ్గిన వస్త్రం ధర
- ఈసారి బతుకమ్మ ఆర్డరూ.. రాలే..
- చేసే పనేదీ లేక మగ్గాలను అమ్ముకుంటున్న దైన్యం
- బతుకమ్మ ఆర్డర్లు వచ్చే మ్యాక్ సొసైటీలదీ ఇదే పరిస్థితి..
- పది మంది చేతుల్లోనే పరిశ్రమ
ముసురుకొచ్చిన సమస్యలు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను మూసివేసే దిశగా తీసుకెళ్తున్నాయి. మార్కెట్‌లో యారన్ ధర పెరిగితే.. వస్త్రం ధర మాత్రం తగ్గడంతో గిట్టుబాటుకావడం లేదు. మరోవైపు ప్రభుత్వం బతుకమ్మ ఆర్డర్లు ఇస్తున్నా.. వాటి లాభాలు పరిశ్రమల్లోని పట్టుమని పదిమంది ఓనర్ల జేబుల్లోకే వెళ్తున్నాయి. ఇప్పుడు ఆ ఆర్డర్ల ఊసే లేక, గతంలో ఇస్తామన్న యారన్ సబ్సిడీ ఖాతాలో జమకాక ఆసాములు అప్పులపాలవుతున్నారు. కనీసం ఇస్తామన్న విద్యుత్ రాయితీ ఇవ్వకపోవడంతో కనీస కూలి గిట్టుబాటుకావడం లేదు. దీనికితోడు కరోనా ధాటికి రెండేండ్లు విలవిల్లాడిన పరిశ్రమ ఇప్పుడు కోలుకునే పరిస్థితిలో లేక.. మరమగ్గాల భాగాలను పాత ఇనుపసామానుకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులపై నవతెలంగాణ ప్రత్యేక కథనం...
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / సిరిసిల్లటౌన్
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే 2003లో సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో అప్పటి సర్కారు తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో టెక్స్‌టైల్‌పార్క్ ఏర్పాటు చేసింది. 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.7.76కోట్లతో ఆధునిక మరమగ్గాలను తెచ్చి వస్త్ర పరిశ్రమనే ఏర్పాటు చేసింది. అయితే, 217 ప్లాట్లతో పార్క్‌లో స్థలం కేటాయించినా కేవలం 70 పరిశ్రమలు మాత్రమే ప్రారంభమై ఇన్నాళ్లూ వస్త్రం ఉత్పత్తి చేశాయి.
విద్యుత్ సబ్సిడీ రాదు.. సర్కారు ఆర్డర్లు అందవు..
టెక్స్‌టైల్ పార్క్‌లోని పరిశ్రమలకు ఇచ్చిన విద్యుత్ కనెక్షన్‌కు చార్జీ చేసే యూనిట్‌కు రూ.7లో సగం మేర సర్కారే రాయితీ రూపంలో భరిస్తుందని తెలిపింది. ఆరేండ్లు గడిచినా ఇంతవరకు రూపాయి సబ్సిడీ కూడా చెల్లించలేదు. స్థానిక ఎమ్మెల్యే, పురపాలకశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ 2021 జూన్‌లో చేనేత జౌళిశాఖ అధికారులు, టెక్స్‌టైల్ పార్క్‌లోని యజమానులతో సమావేశం నిర్వహించారు. 2015 నుంచి 2020 మధ్య ఇవ్వాల్సిన విద్యుత్ రాయితీని చెల్లిస్తామని చెప్పారు. ఆయన హామీ ఇచ్చి 10 నెలలు గడుస్తున్నా.. ఇంతవరకూ రూపాయి అందలేదు. మరోవైపు టెక్స్‌టైల్ పార్క్‌లో ఉత్పత్తి చేస్తున్న వస్త్రానికి వినియోగించే ముడిసరుకు యారన్ (నూలు) ధర విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు కిలో నూలు ధర రూ.140పలకగా.. ఇప్పుడు రూ.200కు చేరింది. ముడి సరుకు ధర పెరగడంతో ఉత్పత్తి వ్యయమూ పెరిగింది. కానీ ఆ ఉత్పత్తులకు ధర మాత్రం మార్కెట్‌లో పెరగ లేదు. దీంతో వ్యాపారులు నష్టాలు చవి చూశారు. ఈ అంశమూ వస్త్ర పరిశ్రమ మూతకు కారణమైంది.
ఇంకోవైపు ఐదేండ్లుగా ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల ఆర్డరు తప్ప మరే ఇతర ఆర్డరూ రావడం లేదు. ఇప్పుడు 2022కు సంబంధించిన బతుకమ్మ చీరల ఆర్డరూ టెక్స్‌టైల్ పార్కుకు కేటాయించకపోవడంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. 1500 అత్యాధునిక మరమగ్గాలతో సుమారు 70 పరిశ్రమలున్న టెక్స్‌టైల్ పార్క్‌లో పది యూనిట్ల మేర సుమారు 300 మరమగ్గాలను అమ్మేశారు. అటు మార్కెట్‌లో గిట్టుబాటు రేటు రాక, ఇటు సర్కారు ఆర్డర్లూ రాక చేసేదేముందని మరమగ్గాలన్నీ అమ్ముకుంటున్నట్టు యజమానులు 'నవతెలంగాణ'తో తెలిపారు.
పదిమంది చేతుల్లోనే పరిశ్రమ..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ... రూ.కోట్లు పెట్టుబడి పెట్టగలిగే కొద్ది మంది యజమానుల చేతుల్లోనే ఉంది. ఆ పది మందే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా, అధికారపార్టీ కీలక నేతలుగా ఉన్నారు. వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్ని స్కీములు పెట్టినా, ఎన్ని రాయితీలు తీసుకొచ్చినా వారి జేబులే నిండుతున్నాయి తప్ప ఆసాములు, కార్మికుల బతుకులు ఎండుతూనే ఉన్నాయి. అందుకు ఈ చిన్న ఉదాహరణే అద్దం పడుతోంది. సిరిసిల్లలో 10 సాంచెలలోపు ఆసాములు 12 మంది చొప్పున ఏర్పడి.. ఒక్కో మ్యాక్ సొసైటీ 180 వరకు ఉన్నాయి. ఇక 25 సాంచెలు.. ఆపై ఉన్న ఆసాములు చిన్న తరహా పరిశ్రమ పేరుతో ఉన్నవారు 190 మంది వరకు ఉన్నారు. ప్రభుత్వం ప్రతియేటా ఆర్డరు ఇస్తున్న రూ.350కోట్ల విలువజేసే బతుకమ్మ చీరలను నేసేందుకు మ్యాక్ సొసైటీలు, ఈ చిన్నతరహా పరిశ్రమలకే అప్పగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మొత్తం పెట్టుబడి పెట్టే శక్తిలేని ఆసాములు చివరికి యజమానుల చెంతకే వెళ్తున్నారు. చీరల ముడిసరుకుపై పెట్టుబడి పెట్టే యజమాని ఒక్కో మీటర్‌పై ప్రభుత్వం ఇచ్చే రూ.33లోంచి రూ.7 వరకు లాభం చూసుకుని మిగతాది ఆసాములు, కార్మికులకు కూలి, ఇతర ఖర్చులకు చూపుతున్నాడు. మీటర్‌పై మిగులుతున్న ఏడు రూపాయలే లక్షల మీటర్లలో వచ్చే ఆర్డర్‌పై రూ.కోట్లలో లాభాలు ఆర్జిస్తున్నారు. ఎటొచ్చీ సాంచెలు నడిపే ఆసాములు, వారి దగ్గర పని చేసే కార్మికులే నష్టపోతున్నారు.
ప్రభుత్వ ఆర్డర్లు సహా విద్యుత్ రాయితీ ఇవ్వాలి
అన్నల్ దాస్ అనిల్- టెక్స్‌టైల్ పార్క్ యజమానుల సంఘం అధ్యక్షులు
నూలు ధరలు విపరీతంగా పెరిగాయి. మార్కెట్‌లో వస్త్రాలకు గిరాకీ పెద్దగా లేదు. సర్కారు ఆర్డర్లూ మూన్నాళ్ల ముచ్చటగానే ఉన్నాయి. విద్యుత్ రాయితీ సహా ప్రభుత్వ ఆర్డర్లు పెంచితే మేము ఏమైనా బతికి బయటపడతాం. లేదంటే అప్పుల ఊబి తప్పదు.
రోడ్డున పడనున్న కార్మికులు
టెక్స్‌టైల్ పార్క్ మూతపడితే కనీసంగా వెయ్యి మంది కార్మికుల కుటుంబాలు రోడ్డునపడతాయి. వీరికి ఇప్పటికే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేక వచ్చిన కూలికి పని చేసుకుంటున్నారు. ఇప్పటికే కరెంటు బిల్లులు భరించలేక కూలీలను తీసుకోవడం లేదు. ఉన్న వారికి ఇచ్చే కూలి ఇవ్వలేకపోతున్నారు.
- కోడం రమణ
టెక్స్‌టైల్ పార్కు వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి