Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశం నుంచి మతతత్వ బీజేపీని తరిమికొడదాం..
- మచ్చలేని నాయకుడు.. ఏజెన్సీ సుందరయ్య కుంజా బొజ్జి
- బొజ్జి స్థూపావిష్కరణ సభలో తమ్మినేని
నవతెలంగాణ-భద్రాచలం
ప్రజలను రెచ్చగొడుతూ.. దేశంలో అరాచకాలు సృష్టిస్తున్న బీజేపీకి రామునిపై ప్రేమ కాదని.. ఢిల్లీ సింహాసనంపైనే ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజుపేట కాలనీలో స్మారక స్థూపాన్ని తమ్మినేని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన వహించారు. తమ్మినేని మాట్లాడుతూ.. క్రమశిక్షణ కలిగిన సైనికుడు, మచ్చలేని నాయకుడు, ఏజెన్సీ సుందరయ్య భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు. రాబోయే కాలంలో భద్రాచలంలో సీపీఐ(ఎం) జెండా గెలిచి తీరాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ ప్రతి కార్యకర్తా, నాయకుడు ప్రజా నాయకుడిగా మారాలని చెప్పారు. మన లోపాలను ఆత్మపరిశీలన చేసుకుని, రాబోయే ఎన్నికలకు నేటి నుంచే సైనికుల వలె పని చేసేలా ముందుకు సాగాలన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాక దేశ సంపదను అమ్మేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకు పెట్రో ఉత్పత్తుల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ దేశ ప్రజలపై మోడీ ప్రభుత్వం ఆర్థిక భారాన్ని మోపుతోందని విమర్శించారు. ప్రజా జీవితాలను అతలాకుతలం చేస్తూ, పోరాటాలను, ఉద్యమాలను అణచి వేసేందుకు నిర్బంధ చట్టాలను ప్రయోగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతతత్వ బీజేపీని దేశం నుంచి తరిమి కొట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాల్లో ప్రజలను రెచ్చగొట్టేందుకు చేస్తున్నట్టే తెలంగాణాలోనూ ఆ విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వామపక్ష శక్తులు, ప్రాంతీయ శక్తులు ముందుకు సాగాలని కోరారు. దుర్మార్గమైన విధానాలను అవలంబిస్తూ దేశంలో కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ సంపదను అప్పజెప్పే పనిలో కేంద్రం ఉందని విమర్శించారు. భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, సీనియర్ నాయకులు పి.సోమయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ మాట్లాడారు. దేశంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న అరాచక, దుర్మార్గ విధానాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. సమాజాన్ని చదివిన బొజ్జి చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. భద్రాచలంలో వరద ముప్పు నుంచి కరకట్ట నిర్మాణం, రెండో వాటర్ ట్యాంక్ నిర్మాణం, భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేయటంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కుంజా బొజ్జి అహర్నిశలు కృషి చేశారని వివరించారు.కుంజా బొజ్జి ప్రథమ వర్ధంతి సందర్భంగా నవతెలంగాణ తీసుకొచ్చిన ప్రత్యేక సంచికను తమ్మినేని ఆవిష్కరించారు. అదేవిధంగా బొజ్జి స్థూపాన్ని నిర్మించిన మేస్త్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, గూగులోత్ ధర్మ నాయక్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సరియం రాజమ్మ, నాయకులు యం.బి.నర్సారెడ్డి, కొలగాని బ్రహ్మచారి, కారం పుల్లయ్య, గడ్డం స్వామి, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు, కుంజా బొజ్జి కుమార్తె, సీఐటీయూ నాయకులు పి.మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.