Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు
- సంగారెడ్డిలో కేవీపీఎస్ రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం
- హాజరైన కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్‌వెస్లీ, స్కైలాబ్ బాబు
- జులై 3,4,5 న సంగారెడ్డిలో కేవీపీఎస్ రాష్ట్ర 3వ మహాసభ
నవతెలంగాణ-కంది
శూద్రులను పశువుల కంటే నీచంగా చూస్తున్న మనువాదంపై మహోద్యమం సాగాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ హాల్‌లో శనివారం కేవీపీఎస్ రాష్ట్ర 3వ మహాసభ ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశాన్ని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమెల మాణిక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ.. నేటి ఆధునిక యుగంలో ఇంకా కులవివక్ష, అంటరానితనం కొనసాగడం దేశం వెనుకబాటు తనానికి నిదర్శనమన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అణగారిన తరగతుల్లో అభద్రత నెలకొందని తెలిపారు. ఓ వైపు సరళీకృత, ఆర్థిక విధానాలు మరోవైపు మనువాద విధానాలతో దేశాన్ని దిగజార్చిందని విమర్శించారు. ఈ సామాజిక అణచివేతపై పోరాటం, కార్మికవర్గ ఐక్యత కోసం కేవీపీఎస్ మహాసభ నిర్వహణను కార్మికవర్గం తమ భుజస్కంధాలపై వేసుకుంటుందని అన్నారు.
కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. బీజేపీ విధానాలు దేశ వ్యాప్తంగా దళితుల పాలిట శాపంగా మారాయన్నారు. కేంద్రం దళితుల బడ్జెట్ కుదించి మోసం చేసిందని, ఉపాధి హామీకి నిధులు తగ్గించి అన్యాయం చేసిందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు ప్రాణం అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారన్నారు. మనువాదంపై పోరాటానికి మానవతావాదులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. మనువాదం పడగవిప్పి బుసలు కొడుతున్న నేపథ్యంలో సామాజిక ఉద్యమాల ఆవశ్యకత మరింతగా పెరుగుతోందని అన్నారు. సంగారెడ్డిలో జులై 3,4,5 తేదీల్లో జరిగే కేవీపీఎస్ రాష్ట్ర 3వ మహాసభను అంబేద్కర్ పూలే ఆలోచనలతో కూడిన ఒక నీలిదండు ఉద్యమంగా జరపాలని పిలుపునిచ్చారు.
ఆహ్వాన సంఘం చైర్మెన్‌గా చుక్కా రాములు
రాష్ట్ర 3వ మహాసభ ఆహ్వాన సంఘం 500 మందితో ఏర్పడింది. ఆహ్వాన సంఘం చైర్మెన్‌గా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదరిగా అతిమెల మాణిక్, కోశాధికారిగా ఎం. శివకుమార్ ఉన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి జయరాజ్, టీజీవో జిల్లా అధ్యక్షులు డాక్టర్ వైద్యనాథ్, కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మైపాల్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పి.బాగారెడ్డి, జిల్లా కోశాధికారి జి.సాయిలు, జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహులు, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాగభూషణం, కార్యదర్శి ఆంజనేయులు, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్, డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బాలరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు రమ్య, ఎస్సీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్, ఉపాధ్యక్షులు శివ కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.