Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21న దేశవ్యాప్త ఉద్యమం : ఏఐఏడబ్ల్యూయూ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోని వ్యవసాయ కార్మికులకు, గ్రామీణ పేదలకు పని కల్పించడానికి ఉద్దేశించిన ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రయత్నిస్తున్నదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) విమర్శించింది. ఆ చట్టాన్ని రక్షించాలనే డిమాండ్‌పై 21న దేశవ్యాప్తంగా ఉద్య మించాలనీ, జిల్లా కేంద్రాల్లో సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఢిల్లీలో ఐదు వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ సర్కారు మొదట బడ్జెట్‌లో కోత విధించిందని విమర్శించారు. నాలుగు శాతం ఉన్న నిధులను ఇప్పుడు 1.7 శాతానికి తగ్గించిందని వివరించారు. నిధులను తగ్గించడమంటే పరోక్షంగా ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నదని తెలిపారు. ఉపాధి హామీకి రోజువారి వేతనం కాకుండా కొలతల ఆధారంగా వేతనాలు ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వం సర్క్యులర్ ఇవ్వడం దుర్మార్గమని విమర్శించారు. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కార్మికులకు ఉదయం, సాయంత్రం రెండుపూటలా హాజరు తీసుకోవాలంటూ నిబంధన విధించడం సరైంది కాదన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో కార్మికులు రెండుపూటలా ఉపాధి హామీ పనులకు వెళ్లడం సాధ్యమేనా?అని ప్రశ్నించారు. రోజుకు రూ.600 ఇచ్చి రెండుపూటలా హాజరు తీసుకోవాలని కోరారు. కానీ కేంద్రం అలాంటి చర్యలకు పూనుకోకుండా నిధులను తగ్గించడం ఎంత వరకు సమంజసమని పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టం అమలుకు రూ.రెండు లక్షల కోట్లు ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని వివరించారు. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు రూ.1.73 లక్షల కోట్లు మాత్రమే కేటాయించిందని పేర్కొన్నారు. కూలీలు పనికిరావడం లేదనే నెపం మోపడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. ఇంతకుముందు 25 మందికి ఒక గ్రూపు ఉండేదనీ, దాన్ని ఇప్పుడు 40 మందికి ఒక గ్రూపు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. ఎండాకాలంలో సమ్మర్ అలవెన్స్ 30 నుంచి 50 శాతం అదనపు వేతనాలు చెల్లించే పద్ధతి ఉండేది గుర్తు చేశారు. ఏటా ఇది అమలు చేస్తారని పేర్కొన్నారు. పర్యావరణం, ఇతర విపత్తుల సమయంలో అదనపు వేతనాలు ప్రభుత్వాలు చెల్లిస్తాయని వివరించారు. ఇప్పుడు సమ్మర్ అలవెన్సును కేంద్రం రద్దు చేసిందని విమర్శించారు. నివాస ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలని చట్టం చెప్తున్నదని తెలిపారు. కానీ మోడీ ప్రభుత్వం అలాంటి చర్యలకు పూనుకోవడం లేదని పేర్కొన్నారు. చట్టం ఉందన్న సోయి లేకుండా వ్యవహరిస్తున్నదని వివరించారు. ఇంతకుముందు ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లేవారని గుర్తు చేశారు. ఇప్పుడు పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వచ్చి ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారని వివరించారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తే అటు పట్టణాల్లో, ఇటు గ్రామీణ ప్రాంతాల్లో పనుల్లేక ప్రజల తీవ్ర ఇబ్బందులు పడతారనీ, కొనుగోలు శక్తి పడిపోతుందనీ, దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. పెరుగుతున్న ధరల వల్ల సామాన్యులు విలవిల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రజలపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూకుమ్మడిగా యుద్ధం చేస్తున్నదని విమర్శించారు. ఉపాధి హామీ ఎవరి దయాదాక్షిణ్యం కాదనీ, అది చట్టమనీ, బిక్ష కాదని గుర్తు చేశారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని నిర్వీర్యం చేయడం దుర్మార్గమని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈనెల 21న దేశవ్యాప్త ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఎస్‌కేఎం, కార్మిక సంఘాలను కోరతామని పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఆయన ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశంలో పిలుపునిచ్చారు.