Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో నిర్వహణ
- 11 తీర్మానాలపై చర్చ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈనెల 27న నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోగల హెచ్‌ఐసీసీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గం, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు, జిల్లా పరిషత్ చైర్మెన్లు, డీసీసీబీ, డీసీఎమ్‌ఎస్ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయాల సంస్థల అధ్యక్షులు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు, మహిళా కో ఆర్డినేటర్లు, జడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, మండల పరిషత్ అధ్యక్షులు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్లందరూ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరు కావాలంటూ సీఎం ఆదేశించారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారు.
వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈనెల 27న ఉదయం 10 గంటలకల్లా ప్రతినిధులందరూ హెచ్‌ఐసీసీకి చేరుకోవాలి. 11 గంటల వరకూ ప్రతినిధుల పేర్లను నమోదు చేస్తారు. 11.05 గంటలకు సీఎం కేసీఆర్ ఆ ప్రాంగణానికి హాజరవుతారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం... ఆయన స్వాగతోపన్యాసం చేస్తారు. అనంతరం వివిధ అంశాలపై 11 తీర్మానాలను ప్రవేశపెట్టి, చర్చిస్తారు. వాటిని ఆమోదించిన అనంతరం సాయంత్రం ఐదు గంటల వరకూ సభ కొనసాగుతుందని టీఆర్‌ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది.
సీఎం ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు...
క్రైస్తవ సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతి, సహనం, త్యాగం వంటి విలువలు సమస్త మానవాళి అనుసరించదగినవని ఆయన పేర్కొన్నారు.