Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజాంకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది
- మే 6న రైతు సంఘర్షణ సభ... రాహుల్ రాక : పీసీసీ చీఫ్ రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్‌ఎస్ పాలనలో అరాచకాలు మితిమీరిపోతున్నాయనీ, అవి ప్రజలు భరించలేని దుస్థితికి చేరుకున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇవే పరిస్థితులు కొనసాగితే, నిజాం ప్రభువుకు పట్టిన గతే సీఎం కేసీఆర్‌కు పడుతుందని హెచ్చరించారు. తెలంగాణలో అన్నదాతలు పండించిన పంటను.. సీఎం కేసీఆర్ మెడలు వంచి కొనిపిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ సీనియర్ నేతలు మధుయాష్కీగౌడ్, మహేష్‌కుమార్ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, బెల్లయ్య నాయక్, మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి రేవంత్ విలేకర్లతో శనివారం మాట్లాడారు. పంట వేయక కొందరు, పంటను తక్కువ ధరకు అమ్ముకొని మరి కొంతమంది రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. పంట వేయక నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకున్న రైతులకు రూ 600 బోనస్ ఇవ్వాలని కోరారు. మిల్లర్లు, ప్రభుత్వం కలిసి రూ 3వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎఫ్‌సీఐకి చెందిన బియ్యం మాయమయ్యాయనీ, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో 8వేల మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారనీ, రాష్ట్రం వచ్చాక 82 వేల మంది రైతులు చని పోయినట్టు ప్రభుత్వం రైతు బీమా ప్రకటనలు ఇచ్చిందని గుర్తు చేశారు.
వరంగల్‌లో భారీ బహిరంగసభ
రాష్ట్రంలో తమ పార్టీ జాతీయ నేత రాహుల్‌గాంధీ పర్యటన ఖరారైందని రేవంత్ చెప్పారు. మే ఆరున వరంగల్‌లో ఆర్ట్స్ కాలేజి మైదానంలో రైతు సంఘర్షణ ఆ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. సభలో రాహుల్‌గాంధీ ప్రసంగిస్తారని చెప్పారు. ఈనెల ఏడున 7న హైదరాబాద్‌లో పార్టీ నాయకులతో ఆయన సమావేశమవుతారని తెలిపారు. సీఎం కేసీఆర్ అవినీతిని ఎండగట్టడానికే రాహుల్ గాంధీ ఇక్కడకు వస్తున్నారని చెప్పారు. మరో ఏడాదిలో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజరు అదుపులో ఉండాలనీ, జిల్లాలో ఆయన అరాచకాలు మితిమీరిపోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెట్టి శునకానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు.
40 లక్షల మందికి ప్రమాద బీమా
రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి 40 లక్షల మందితో డిజిటల్ సభ్యత్వాన్ని నమోదు చేశామనీ, వారందరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని రేవంత్ వెల్లడించారు. రెండు లక్షల రూపాయల భీమా క్లెయిమ్ చేయవచ్చు అని చెప్పారు. దాన్ని పొందడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో డీసీసీ అధ్యక్షులకు అవగాహన కల్పించారు. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్...శనివారం ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. రాహుల్ రెండు రోజుల పర్యటన, సభ్యత్వ నమోదు, వరంగల్‌సభ తదితర అంశాలపై చర్చించారు.