Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సింగరేణి ప్రతినిధి
ఏ కారణం చేతనైనా ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించబడిన మైనింగ్ సిబ్బందికి సర్ఫేస్‌లో సూటబుల్ ఉద్యోగం ఇవ్వకపోవడంపై మైనింగ్ స్టాప్ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం సింగరేణి వ్యాప్తంగా నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి గనులపై మేనేజర్లకు వినతిపత్రం అందజేసినట్లు నాయకులు మాదాసి రామమూర్తి, నాగేల్లి సాంబయ్య తెలిపారు. రామగుండం రీజియన్‌లోని ఆర్‌జీ 1, 2, 3 పరిధిలోని నాలుగు ఓసీపీ, ఆరు భూగర్భ గనులు, రెస్క్యూ, ఎంవిటిసిలపై కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. బెల్లంపల్లి రీజియన్‌లోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, గోలేటి, భూపాలపల్లి జిల్లా, కొత్తగూడెం రీజియన్‌లోని మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం డివిజన్లలో పనిచేస్తున్న మైనింగ్ సిబ్బంది పెద్దఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మైనింగ్ సిబ్బంది శాంతియుతంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తగురీతిలో స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగవలసి వస్తుందని కేంద్ర కమిటీ నాయకులు హెచ్చరించారు. మైనింగ్ సిబ్బంది న్యాయమైన కోరికలపై ఈనెల 19న కార్మిక సంఘాలతో జరగనున్న త్రైపాక్షిక చర్చల్లో ప్రస్తావించి తగు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంగరి రాజేశ్వరరావు, మారేపల్లి బాబు, టి.బానేశ్, దొంగరి శ్రీనివాస్, బత్తుల రమేష్, శంకరయ్య, వెంకటస్వామి, డి.శ్రీనివాస్, గోపతి సత్యనారాయణ, రాంచందర్ పాల్గొన్నారు.