Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులపై కేసు నమోదు
- త్వరలో మరికొంత మందిపై కూడా
- నాంపల్లి మండల కేంద్రంలో ఘటన
- నవతెలంగాణ ఎఫెక్ట్
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తప్పు చేసిన ఏ వ్యక్తి అయినా ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు అన్నట్టు.. పేదల సొమ్ము కాజేయాలని చూసిన అధికార పార్టీ నేతలపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు పూనుకోనుంది. సుమారు ఏడాది కాలంగా ఆక్రమణదారులపై జరిగిన విచారణ చివరికి ఓ కొలిక్కి వచ్చింది. పేదల ఇండ్ల స్థలాలను ఆక్రమించిన ముగ్గురిపై కేసు నమోదైంది. కోట్ల రూపాయాల విలువైన భూముల ఆక్రమణపై 'నవతెలంగాణ' గతేడాది ఫిబ్రవరిలో వరుస కథనాలను ప్రచురించింది. దానికి సంబంధించిన ప్రభుత్వం విచారణ చేసి కేసు నమోదు చేసింది.
82 మంది లబ్దిదారులకు ఇండ్ల స్థలాలు
నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీ ఎదురుగా ఉన్న 489, 492 సర్వేనెంబర్‌లో 4 ఎకరాల భూమిని 1987లో పేదల కోసం నాటి ప్రభుత్వం కొనుగోలు చేసింది. 82మంది లబ్దిదారులను ఎంపిక చేసి, వారికి 150 గజాల చొప్పున ప్లాట్లు చేసి, పట్టా కాగితాలను పంపిణీ చేసింది. నాటి జిల్లా కలెక్టర్ సారథ్యంలో లే-అవుట్ చేసి ప్లాట్లకు నెంబర్లు వేశారు. ఈ ప్లాట్లలో 32 ఇండ్ల నిర్మాణం ప్రభుత్వమే చేసింది. 82 మంది లబ్దిదారులుంటే 32 ఇండ్ల నిర్మాణమే చేసారు. దాంతో ఎవరికి ఇవ్వాలే అనే విషయంలో గందగోళం ఏర్పడి ఎవరికీ పొజీషన్ చూపించకుండా వదిలేశారు. అయితే, భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి రిజిస్ట్రేషన్ చేయించే విధానంలో కుట్ర జరిగింది. ముగ్గురు వ్యక్తుల నుంచి నాటి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ భూమిని నాటి సర్పంచ్ ప్రణాళిక ప్రకారమే తన అనుచరులైన వ్యక్తులకు పట్టా చేయించారు. అనంతరం ఆ పట్టాదారుడి నుంచి అప్పటి సర్పంచ్ తన పేరుతో పట్టా చేయించుకున్నాడు. తన పేరుపై ఉండటం.. ప్రభుత్వమూ మళ్లీ ఇండ్ల గురించి పట్టించుకోకపోవడంతో ఇతరులకు విక్రయించారు. ఇదే విషయాన్ని గత ఏడాది ఫిబ్రవరిలో ''నవ తెలంగాణ'' వరుస కథనాలతో ప్రచురించింది. దానికి ప్రభుత్వం స్పందించి ఏడాది కాలంగా విచారణ చేయించింది. చివరికి అసలైన లబ్దిదారుల నుంచి అధికారులు సమాచారం సేకరించి వాస్తవాలను తెలుసుకున్నారు.
పేదలకు ఇచ్చిన స్థలాలకు చెందిన భూమిని కొంతమంది కబ్జా చేశారని లబ్దిదారుడు దాచేపల్లి వెంకటేశ్వర్లు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానిని పరిశీలించిన పోలీసులు విచారణ చేశారు. ఏడాది కాలంగా సాగిన విచారణలో ప్రధానంగా ఆరోపణలున్న ముగ్గురుపై ఈనెల 14న కేసు నమోదు అయింది. 447,427,120బి, 468ఆర్/డబ్ల్యూ 34ఐపిసీ సెక్షన్ల కింద కేసు అయింది. వీరేగాకుండా మరికొంత మందిపై కూడా కేసులు నమోదు చేయనున్నట్టు తెలిసింది.
విచారణ జరుగుతుండగానే ..
పేదల ఇండ్ల స్థలాల ఆక్రమణపై ఒకవైపు పోలీసు అధికారులు విచారణ చేస్తుండగానే.. మరోకవైపు ఆక్రమణదారులు, తహసీల్దార్ కుమ్మక్కై కొంత మందికి రిజిస్ట్రేషన్లు చేసినట్టు సమాచారం. కొనుగోలుదారులకు గజాల చొప్పున విక్రయించి, గుంటల చొప్పున రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్లు జరుగుతున్న క్రమంలో ఇండ్ల స్థలాల లబ్దిదారులు మండల రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తే కనీసం తహసీల్దార్ స్పందించకపోగా.. రిజిస్ట్రేషన్లు కొనసాగించారు.