Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మౌలిక వసతులతోపాటు మానవ వనరులూ అభివృద్ధి కావాలి
- వినోద్‌కుమార్‌కు
- టీఎస్‌జీహెచ్‌ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వరంగంలో పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) డిమాండ్ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు మానవ వనరులనూ అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ను శనివారం హైదరాబాద్‌లో టీఎస్‌జీహెచ్‌ఎంఏ అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, అదనపు ప్రధాన కార్యదర్శి టి రాధాకృష్ణ, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రామిరెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణలో భాగంగా పది జిల్లాలను 33 జిల్లాలకు ప్రభుత్వం విస్తరించిందని తెలిపారు. అందుకనుగుణంగా పాఠశాల విద్యావ్యవస్థలో మార్పులు చేపట్టాల్సిన అవసరముందని సూచించారు. సర్వీసు నిబంధనల అమల్లో ఏర్పడిన ప్రతిష్టంభన ద్వారా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోవడం వల్ల 90 శాతం ఖాళీలు మిగిలిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు దశాబ్ధాలుగా పర్యవేక్షణ వ్యవస్థ, డైట్, ఎస్‌సీఈఆర్టీ ఉన్నతస్థాయి విద్యావ్యవస్థలు పూర్తిగా నిస్తేజమయ్యాయని వివరించారు. ఖాళీలను భర్తీ చేసి పునరుత్తేజం చేయాలని కోరారు. రాష్ట్రంలోని రెండు మల్టీజోన్ల పరిపాలన కోసం రెండు అదనపు డైరెక్టర్ల పోస్టులను మంజూరు చేసి పదోన్నతుల ద్వారా నియమించాలని సూచించారు. పాఠశాల విద్యాశాఖలో అదనపు సంచాలకులున్నారనీ, కిందిస్థాయి సిబ్బందిని అనుసంధానించడానికి డీడీ, జేడీ స్థాయి అధికారుల పోస్టులను మంజూరు చేసి పదోన్నతుల ద్వారా నియమించాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి నాలుగు మండలాలను ఒక విద్యా డివిజన్‌గా పరిగణిస్తూ 150 విద్యాడివిజన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి డివిజన్‌కూ ఒక డివిజనల్ విద్యాధికారి పోస్టును సృష్టించి పదోన్నతి ద్వారా భర్తీ చేయాలని పేర్కొన్నారు. 602 మండలాలను ఎడ్యుకేషన్ బ్లాక్‌లుగా పరిగణిస్తూ ప్రతి మండలానికి ఒక బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టును సృష్టించి పదోన్నతి ద్వారా భర్తీ చేయాలని కోరారు. వినోద్‌కుమార్ సానుకూలంగా స్పందించారనీ, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని తెలిపారు.