Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భూముల కోసం, మనుగడ కోసం ప్రశ్నించే ఆదివాసీల గొంతును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం క్రూరమైన అటవీ చట్టాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కుంటున్నారని అన్నారు. వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రకటిత యుద్ధం చేస్తున్నాయని విమర్శించారు. ఎస్సీ,ఎస్టీలకు అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తున్నదని చెప్పారు. వారి అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదని అన్నారు. విద్య, ఆరోగ్యం, తాగునీరు, రోడ్లు, శాంతిభద్రతల రంగాల్లో గిరిజనులు వెనుకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హక్కుల కోసం ఎదురుతిరిగితే పోడు రైతులపై తప్పుడు కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ, భూదాన భూములు, చెరువులు, కుంటలు, శిఖాలు, నాలాలు, వక్ఫ్, దేవాదాయ భూములు అన్యాక్రాంతమయ్యాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి పోడు సాగుదార్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుపరిచేందుకు, హక్కుల సాధన కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అంజయ్యనాయక్, కార్యవర్గ సభ్యులతోపాటు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.