Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏం చేశారో చెప్పాలని జనాలు నిలదీయాలి
- ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ- మిర్యాలగూడ
బీజేపీది ప్రజలను ముంచే యాత్ర అని, కేంద్రంలో అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశారో జనాలు యాత్రలో నాయకులను నిలదీయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఓవైపు ప్రజలపై బీజేపీ ప్రభుత్వం తీవ్ర భారాలు మోపుతుంటే.. ఏం ఉద్ధరించారని ఆ పార్టీ నాయకులు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారాలు మోపుతోందని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై యాత్రకు వచ్చే నాయకులను ప్రజలు నిలదీసి అడ్డుకోవాలన్నారు. ప్రజలే బీజేపీపై సంగ్రామం చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పండిన వరి పంటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. కేంద్రం రైతుల పట్ల చూపుతున్న వివక్షను ప్రజలు ఎండగట్టాల న్నారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ తేమశాతం 17 మాత్రమే ఉండాలని నిబంధనలు పెట్టడం వల్ల రైతులు ధాన్యం అమ్ముకోలేక మిల్లులకు పోతున్నారని వాపోయారు. దీన్ని ఆసరా చేసుకున్న మిల్లర్లు తక్కువ ధర వేస్తూ రైతులను నిండా ముంచుతున్నారన్నారు. పైగా తరుగు చార్జీల పేరిట అదనంగా రైతుల నుంచి వసూలు చేస్తున్నారని దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. సన్నరకం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, లేకపోతే మిల్లర్స్ మద్దతు ధరకు అదనంగా ధర ఇచ్చే విదంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బీకార్ మల్లేశ్, నాయకులు డాక్టర్ గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి, పరుశురాములు, ఎండి అంజాద్, బీఎం.నాయుడు, రామారావు, యేసు, నాగేందర్, పతని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.