Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిప్పంటించుకొని తల్లీకొడుకు ఆత్మహత్య
- పోలీసులు, ప్రజాప్రతినిధులు మానసికంగా వేధించారు
- ఒక్క శాతం న్యాయం కూడా చేయలేదు
- సూసైడ్‌కు ముందు సెల్ఫీవీడియో
నవతెలంగాణ-కామారెడ్డిటౌన్/ రామాయంపేట
పోలీసు యంత్రాంగం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒక్కటై మానసికంగా వేధించారు.. 18 నెలలుగా మనశ్శాంతి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ తల్లీకొడుకు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జీలో శనివారం జరిగింది. మృతులు మెదక్ జిల్లా రామయంపేట్ పట్టణానికి చెందిన సంతోష్(40), పద్మ(65)గా పోలీసులు గుర్తించారు. వారి మృతికి ఏడుగురు కారణం అంటూ సెల్ఫీ వీడియోతో పాటు లేఖ రాసి పెట్టి.. నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
రామయంపేట్‌కు చెందిన సంతోష్ తల్లిదండ్రులు గంగం పద్మ, అంజయ్యతో కలిసి ఈనెల 11వ తేదీన మహారాజా లాడ్జిలోని 203వ గదిలో బస చేశారు. తన తండ్రిని ఆస్పత్రిలో చూపించేందుకు వచ్చినట్టు లాడ్జి సిబ్బందికి తెలిపారు. 12వ తేదీ ఉదయం కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్లి వచ్చారు. తాము తర్వాత వస్తామని చెప్పి అంజయ్యను రామాయంపేట్‌కు పంపించారు. తర్వాత గంగు సంతోష్, పద్మ లాడ్జిలోనే ఉన్నారు. బాసర, పుణ్యక్షేత్రాలకు వెళ్లి వస్తున్నామని లాడ్జి సిబ్బంది చెప్పారు. శనివారం ఉదయం 5:30 సమయంలో రూమ్ నుంచి మంటలు రావడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పేశారు. అప్పటికే తల్లీకొడుకు సజీవ దహనమయ్యారు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాట్టు గుర్తించారు. కాగా అంతకుముందు రోజు రాత్రి తన సోదరుడికి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్ చేసినట్టు సమాచారం. అదేవిధంగా సెల్ఫీ వీడియో తీసుకొని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తమ ఆత్మహత్యకు కారకులని ఏడుగురి ఫొటోలతో లేఖ రాశారు.
మున్సిపల్, మార్కెట్ చైర్మెన్లు టీంగా ఏర్పడి వేధింపులు
సెల్ఫీ వీడియో.. లేఖలో ఉన్న వివరాల ప్రకారం.. 'నా పేరు గంగు సంతో ష్. మా అమ్మ పద్మ, నాన్న అంజయ్య. మా చావుకు కారకులు రామయంపేట్ మున్సిపల్ చైర్మెన్ పల్లె జితేంద్రగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ సరాపి యాదగిరి, ఐరన్ పృథ్విరాజ్, తోట కిరణ్, కన్నాపురం కృష్ణగౌడ్, సరాఫ్ స్వరాజ్, రామాయంపేట సీఐగా పనిచేసిన నాగార్జునగౌడ్. వీరందరూ కలిసి కక్షగట్టి, నా వ్యాపారంలోనూ,ఆర్థికంగా,మానసికంగా వేధింపు లకు గురిచేశారు. వారి వల్ల 18నెలలుగా చాలా రకాలుగా నష్టపోయాం.నా తల్లిదండ్రులకు మనశ్శాం తి లేకుండా చేశారు. వీళ్ల వల్ల ఆస్తులు, డబ్బు నష్టపో యాను. అప్పులు కూడా చేశాను. డబ్బులు పోయినా పరవాలేదు. మళ్లీ సంపాదించు కోగలననుకున్నా. కానీ, నా పర్సనల్ వ్యవహారాలను రామయంపేట సీఐ నాగార్జునగౌడ్, జితేందర్‌గౌడ్ మెమోరీ కార్డు ద్వారా తస్కరించి మానసికంగా వేధించారు. వారిపై ఫిర్యాదు చేసి 110 రోజులు అవుతోంది. రాజకీయ నాయకులకు, ప్రముఖులకు ఫిర్యాదు చేసినా.. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు కావడంతో ఒక్క శాతం కూడా న్యాయం జరగలేదు. ఇంకా వారి వేధింపులు ఆగడం లేదు. అందుకే అమ్మా, నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాం. మా కుటుంబానికి మమ్మల్ని దూరం చేస్తున్నారు. మేము చనిపోయాక అయినా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. ఇక సెలవు' అంటూ సెల్ఫీ వీడియో ద్వారా సంతోష్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, మంత్రి హరీశ్‌రావు, మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత ఎవరైనా సరే పార్టీ అని చూడకుండా తమ ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని సూసైడ్ లెటర్‌లో సంతోష్ కోరాడు. ఆ ఏడుగురిపై 306సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. డీఎస్పీ సోమనాథం ఆధ్వర్యంలో విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు.
మున్సిపల్ చైర్మెన్ ఇంటిముందు ఆందోళన..
కామారెడ్డి నుంచి తల్లీకొడుకుల మృతదేహాలను రామాయంపేట్‌కు తీసుకొచ్చారు. కాగా, మున్సిపల్ చైర్మెన్ పల్లె జితేంద్రగౌడ్ వేధింపులతోనే తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకున్నారంటూ మృతదేహాలతో వేలాది మంది చైర్మెన్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్టు చేసేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని బైటాయించారు. మూడు నెలల కిందటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని స్థానికులు గొడవకు దిగారు. బాధితులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మ్యాడం బాలకృష్ణతో పాటు రామాయంపేట కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు మద్దతుగా నిలిచారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింప చేసే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. నిందితులపై సెక్షన్ 306 ప్రకారం కేసు నమోదు అయిందని, చట్టం ప్రకారం ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షిస్తామని ఆమె హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.