Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెక్ డ్యామ్ నిర్మాణాల్లో నాసిరకం పనులు
- గతేడాది వరదల్లో కొట్టుకుపోయిన వైనం
- రెండోసారి చేపట్టిన పనుల్లోనూ నాసిరకం
- ప్రజాధనం దుర్వినియోగం
నవతెలంగాణ-మల్హర్‌రావు
భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల సరిహద్దులోని మానేరుపై ప్రభుత్వం చేపట్టిన చెక్‌డ్యాంల నిర్మాణ పనులు మున్నాండ్ల ముచ్చటగా నాసిరకంగా చేపడుతున్నారు. సంబంధిత ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో గుత్తేదారులు ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్న చందంగా మారింది. గతేడాది ఇదే నెలలో అధికారుల నిర్లక్ష్యం వల్ల అకాలంగా కురిసిన వర్షాలకు చెక్‌డ్యామ్‌ల పనుల ప్రారంభంలోనే నీటిపాలయ్యాయి. ప్రస్తుతం కూడా నిర్మాణాల్లో అడుగడుగునా డొల్లతనం, నాసిరకపు పనులు కొట్టొచ్చినట్టు దర్శనమిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలంలోని పలు గ్రామాల్లో కోట్ల రూపాయలతో చేపట్టిన చెక్‌డ్యామ్ నిర్మాణాల్లో అధికారపార్టీ నేతలు, సంబంధిత అధికారులు కుమ్మక్కై కోట్ల నిధులు మింగేసేందుకు యత్నిస్తున్నట్టు బహిరంగ ఆరోపణలూ వస్తున్నాయి.
పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దునున్న తాడిచెర్ల ఖమ్మంపల్లి, సోమన్‌పల్లి, పీవీనగర్, చిన్నఓదల, మల్లారం గ్రామాల్లో చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా రూ.14.31 కోట్లతో ఖమ్మంపల్లి నుంచి తాడిచెర్ల మానేరు ఒడ్డు వరకు, రూ.13.40 కోట్లతో సోమన్‌పల్లి, పీవీనగర్ మానేరుపై ఒడ్డు వరకు, రూ.14.50 కోట్లతో చిన్న ఓదాల నుంచి మల్లారం మానేరు ఒడ్డు వరకు.. నిర్మాణాలు చేపట్టడానికి సెప్టెంబర్ 15, 2020న ఒప్పందం చేసుకున్నారు. 2021 ఫిబ్రవరి 21న నాటి మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. గతేడాది ఇదే నెలలో పనులు ప్రారంభించగా ప్రభుత్వం రూ.5కోట్లు మంజూరు చేసింది. గుత్తేదారు పనులు ప్రారంభించిన కొద్ది రోజులకే భారీ వర్షాల మూలంగా మానేరు నదిపై వరదలు రావడంతో చేసిన సగం పనులు నాసిరకంగా చేపట్టడంతో చెక్‌డ్యామ్‌లు కొట్టుకుపోయాయి. దాంతో పని ప్రదేశంలో నాలుగు బండరాళ్లు, ఇసుక దిబ్బలు మాత్రమే మిగలగా, కోట్ల నిధులు నీటిలో కలిసిపోయి ఇసుక పాలవ్వడంతో ఎంత మేరకు పనులు జరిగాయో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో సదరు కాంట్రాక్టర్‌కు పార్ట్ పేమెంట్ కింద రూ.5లక్షలు మంజూరైనట్టు తెలిసింది. రెండవసారి నిర్మాణ పనులు చేపట్టి మూడు వారాలు దాటుతున్నా పనులు ఇంకా పునాదుల్లోనే కొనసాగుతున్నాయి. దీనికితోడు నాసిరకమైన పనులు చేపట్టడం గమనార్హం. గ్రేడ్-53 సిమెంట్‌కు బదులు తక్కువ గ్రేడ్ ఉన్న సిమెంట్ వాడుతున్నారని, నాసిరకమైన ఇనుపరాడ్లు వినియోగిస్తున్నారని, భూమి లోపలి నుంచి 10ఫీట్ల పిల్లర్లు, 5 ఫీట్ల గోడ నిర్మించకుండా తూతూ మంత్రంగా బెడ్లు పోసి వదిలేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతో ఇష్టారీతిన పనులు చేపుడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఏడాది పూర్తయినా పనుల్లో అలసత్వం
భూపాలపల్లి జిల్లా ఖమ్మంపల్లి మానేరుపై నుంచి తాడిచెర్ల ఒడ్డు వరకు డీఎఫ్టీ నిధుల కింద రూ.16.62 కోట్లు, అడవి సోమన్‌పల్లి మానేరుపై నుంచి పీవీనగర్ ఒడ్డు వరకు రూ.14.22 కోట్లు మంజూరైనట్టు తెలిసింది. అగ్రిమెంట్ మాత్రం ఖమ్మంపల్లి తాడిచెర్ల వరకు రూ. 14.31, సోమన్‌పల్లి, పీవీనగర్‌ది రూ.13.40 కోట్లతో అయింది. మొదటిసారి అగ్రిమెంట్ చేసుకుప్పటి నుంచి మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలి. కానీ ప్రస్తుతం ఏడాది పూర్తయినా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. మానేరుపై 500 మీటర్ల పొడవుతో నిర్మాణం చేయనున్న చెక్‌డ్యామ్‌ల కింద సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టు ఉన్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికైనా పనులు త్వరగా నాణ్యతతో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు.
పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి : మలహల్‌రావు, ఎంపీపీ
మానేరుపై నిర్మాణం చేస్తున్న చెక్‌డ్యామ్ పనుల్లో గుత్తేదారులు నాణ్యత ప్రమాణాలు పాటించాలి. కోట్ల రూపాయలతో చేపడుతున్న చెక్‌డ్యామ్‌లు పది కాలాలపాటు ఉండాలంటే నిబంధనలు పాటించాలి. లేదంటే రైతుల పక్షాన ఆందోళన చేస్తాం.
నిబంధనల మేరకే పనులు : రమేష్ బాబు, మంథని డీఈ చెక్ డ్యామ్ నిర్మాణాల్లో నిబంధనల మేరకు గుత్తేదారులు పనులు నిర్వహిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు తప్పవు. నిర్మాణ పనులపై సంబంధిత ఏఈ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుంది.