Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్, ఫూలే, రణదీవె స్ఫూర్తితో పోరాడాలి
- 'సామాజిక సమస్యలు-కార్మిక వర్గ దృక్పథం'పై సీఐటీయూ సెమినార్‌లో ఎస్.వీరయ్య
- కేవీపీఎస్ పోరాటాలకు సీఐటీయూ రూ.2 లక్షల విరాళం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మికులంతా ఐక్య పోరాటంతో సమాజ సమూల మార్పునకు కృషి చేయాలనీ, కార్మిక రాజ్య స్థాపనతోనే దోపిడీ, వివక్ష రూపాలకు అడ్డుకట్ట వేయగలుగుతామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య చెప్పారు. అంబేద్కర్, ఫూలే, బీటీ రణదీవె లాంటి మహనీయుల స్ఫూర్తితో కులవివక్ష మీద పోరాడాలనీ, కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలనే కార్యాచరణతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో 'సామాజిక సమస్యలు-కార్మిక వర్గ దృక్పథం' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. కుల నిర్మూలన కోసం పోరాడుతున్న కేవీపీఎస్ సంఘానికి సీఐటీయూ రాష్ట్ర కమిటీ రూ.2 లక్షల రూపాయలను అందజేసింది. ఆయన మాట్లాడుతూ.. అత్యంత ఆధునిక పరిశ్రమలు అని చెప్పుకునే పరిశ్రమల్లో కూడా దళితులు,గిరిజనులు,మహిళలు సామాజిక వివక్షను యాజమా న్యాలు, సూపర్‌వైజర్ల నుంచే కాకుండా వెనుకబాటు రీత్యా తోటి కార్మికుల నుంచి ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. పారిశుధ్య కార్మికులు తాగునీళ్లను అడిగితే తిరస్కరించడమో, పైనుంచి ఎత్తిపోస్తున్న పరిస్థితి హైదరాబాద్ మహానగరంలోనూ ప్రత్యక్షంగా చూస్తున్నామ న్నారు. కార్మిక సంఘాలు ఆర్థిక సమస్యలపై పోరాటాలకే పరిమితం కాకుండా సామాజిక అంశాలనూ ఎత్తుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. రణదీవె, అంబేద్కర్, జ్యోతిబాఫూలేలు కుల వివక్షకు వ్యతిరేకంగానే కాకుండా మహిళా హక్కుల కోసం పోరాడిన తీరును వివరించారు. వారిని కొన్ని కులాలకో, కొందరికో పరిమితం చేయడం సబబు కాదన్నారు. ముచ్చింతల్‌లో రామానుజుని పెద్ద విగ్రహానికి సమతామూర్తి అని పేరుపెట్టి ఎన్నికల్లో రాజకీయ ప్రచారం చేసుకున్నది కేంద్రంలోని బీజేపీ పార్టీ, ప్రధానమంత్రి అని విమర్శించారు. ఆ విగ్రహావిష్కరణలో గద్దర్‌పోయి పాటపాడాడనీ, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. రామానుజులు చెప్పిన విషయం ఆనాటి కాల పరిస్థితులకు గొప్పదే కావొచ్చన్నారు. కానీ, అన్ని కులాల వాళ్లు దేవుడు దగ్గరకు పోవడమే సమానత్వమా? ఎలా అవుతుందని ప్రశ్నించారు. కులాలున్న తర్వాత కులాలన్నీ సమానమెలా అవుతాయని నిలదీశారు. మోడీ సమతా విగ్రహాన్ని ఆవిష్కరించి ఎన్నికల ప్రచార అస్త్రంగా వాడుకున్న తీరును వివరించారు. అందుకే, ఆనాడే అంబేద్కర్ కుల నిర్మూలన అని చెప్పాడని గుర్తుచేశారు. కులవ్యవస్థను ధ్వంసం చేయకుండా భారత సమాజం ముందుకు పోదని నొక్కిచెప్పాడన్నారు. 21వ శతాబ్దంలో ఉన్న మనం ఇంకా ముందు చూపుతో, ఆధునిక సిద్ధాంతంతో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. సమాజాన్ని సమూల ంగా మార్చే ఆధునిక నినాదాలు ప్రజల నినాదాలుగా ఉండాలన్నారు. గత నినాదాలే యథాతధంగా తీసుకుంటే కులాలను నిర్మూలించలేమనీ, మరింత బలపడేందుకు దోహదం చేసినట్టు అవుతుందని చెప్పారు. ఆధిపత్యవాదుల దాడులను తిప్పికొట్టేందుకు, తమ గొప్పతనాన్ని చెప్పుకునేందుకు ఆనాటి కాలంలో వచ్చినవే కుల పురాణాలు అన్నారు. అవీ నేడు మనుషులను కులాలుగా విడగొట్టేందుకే దోహదపడుతున్నా యన్నారు. కులం పేర తోకలు తగిలించుకునే పోటీ ప్రారంభమైందనీ, ఇది ముమ్మాటికీ కుల అస్థిత్వాన్ని మరింత బలోపేతం చేయడమేనని చెప్పారు. కులం తోకలు అవసరం లేదని తన పేరులోని రెడ్డిని తీసేసి సుందరయ్య దేశానికే ఆదర్శంగా నిలిచిన మహనీయుడన్నారు. గతంలో ఓ పరిశ్రమలో కార్మిక, ఉద్యోగ సంఘాలుంటే నేడు కులాల పేరుతో సంఘాలు పుట్టుకొచ్చాయనీ, తమ సొంత ప్రయోజనాల కోసం పాలకవ ర్గాలు, యాజమాన్యాలు వాటిని ప్రోత్సహిస్తున్నారని వివరించారు. అవి పుట్టుకురావడానికి గల కారణం ఏమిటనే విషయాన్ని కార్మిక సంఘాలు గ్రహించాల్సిన అవసరం ఉందని సూచించారు. కార్మికుల ఆర్థిక సమస్యలకే పరిమితం కాకుండా వారికొచ్చే అన్ని రకాల సమస్యలనూ పరిష్కారం కోసం యూనియన్లు పనిచేస్తే ఇలాంటివి పుట్టుకురావన్నారు. వివక్ష, లైంగిక వేధింపులను కూడా యూనియన్ ప్రశ్నిస్తుందనే నమ్మకం ఉంటే అందరూ ఒకే గొడుగు కిందకు వచ్చి పోరాడుతారని చెప్పారు. అది ప్రజలను ఐక్యం కాకుండా చేయడమేనన్నారు. ఇది కుల నిర్మూలనకు ఉపయోగపడదనీ, ఇలా చేయడం ఆ నేతల ఆశయాలకు తూట్లు పొడవడమేనని చెప్పారు. ఆధునీక, శాస్త్రీయ పద్ధతుల్లో కుల నిర్మూలన కోసం, సమసమాజ స్థాపన కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఏది సమానత్వ భావనకు దోహం చేస్తుంది? ఏది కుల నిర్మూలనకు ఉపయోగపడుతుంది? ఏది కార్మిక వర్గ ఐక్యతకు ఉపయోగపడుతుంది? అనే విషయాలను గ్రహించాలన్నారు. పబ్లిక్ సెక్టార్‌నే నిర్వీర్యం చేశాక రిజర్వేషన్ అమలు ఎక్కడ అని ప్రశ్నించారు. దోపిడీ సమాజం నుంచి విముక్తి కల్పించి సమసమాజం దిశగా కార్మికులంతా ఐక్యమై పోరాడాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ..కార్మికులు తమ హక్కుల కోసం పోరాడకుండా కులం, మతం పేరుతో యాజమాన్యాలు, పాలకులు చీల్చి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ఆధునిక సమాజంలోనూ కులవివక్ష విషకోరలతో బుసలు కొడుతోందన్నారు. ఈ విషయంలో తమకు జరుగుతున్న నష్టాన్ని కార్మికులు గ్రహించి ఐక్యం ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సమాజంలోని అసమానతలు రూపుమాపడంతో సీఐటీయూగా తమ శక్తిమేరకు పోరాడుతామని హామీనిచ్చారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ, స్కైలాబ్ మాట్లాడుతూ.. తమ పోరాటానికి ఆర్థిక సహాయం అందజేసి సీఐటీయూ కొత్త ఒరవడికి నాంది పలికిందన్నారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీకి, తమ రెక్కల కష్టాన్ని సహాయంగా ఇచ్చిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయం కోసం పోరాడే బాధ్యత సీఐటీయూపైనా ఉందని చెప్పారు. నేడు మన దేశంలో పశువులకిచ్చిన గౌరవం కూడా కొన్ని సామాజిక తరగతుల మనుషులకు ఇవ్వడం లేదని వాపోయారు. ఇలాంటి వివక్ష పోవాలనే తాము పోరాడుతున్నామని చెప్పారు. హిందూ మతంలోని అంటరానితనం, వివక్ష నచ్చకనే బౌద్ధంలో చేరానని అంబేద్కర్ ప్రకటించుకున్నారని చెప్పారు. దళితులకు దగ్గరయ్యేందుకు నేడు అదే హిందూత్వవాదులు అంబేద్కర్‌ను వాడుకోవాలని చూడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ మాట్లాడుతూ..ప్రతిపోరాటంలోనూ, కార్మికవర్గ రాజ్య స్థాపనలో మహిళల పాత్ర కీలకంగా ఉండాలన్నారు. ఢిల్లీ రైతాంగ పోరాటంలో మహిళా రైతుల పోరాటతత్వాన్నీ, ధీరత్వాన్ని వివరించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన వహించారు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ నాయకులను వేదిక మీదకి ఆహ్వానించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వీఎస్‌రావు వందన సమర్పణ చేశారు.