Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యథేచ్ఛగా రియల్ దందా
- జోరుగా సాగుతున్న భూముల క్రయవిక్రయాలు
- 1/70 చట్టానికి తూట్లు..పీసా కమిటీ అనుమతుల్లేవ్
- తెలిసినా.. అధికారులు గప్ చుప్
రియల్టర్ల కండ్లు ఇపుడు ఏజెన్సీ ప్రాంతాలపై పడింది. ఎక్కడ జాగా కనిపిస్తే అక్కడ అన్నట్టుగా రియల్ దందా కొనసాగుతోంది. అటవీ భూముల్లోనూ అడుగుపెట్టాలంటే..దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. కానీ ఇవేం వారికి పట్టడంలేదు. పొక్లయినర్లతో పచ్చని చెట్లను తొలగించి మరీ ప్లాట్లకు హద్దులు వేస్తున్నారు. అయితే దీని వెనుక అధికారపార్టీ నేతల హస్తం ఉన్నదన్న ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల ఈ అక్రమ దందా జరుగుతున్నా.. అధికారులు గమ్మునుంటున్నారు.దీంతో రియల్ దందాకు అడ్డు అదుపులేకుండా పోతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
నవతెలంగాణ- ఇంద్రవెల్లి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రియల్ దందా మూడు పువ్వులు.. ఆరుకాయలుగా సాగుతోంది. కొందరు రియల్టర్లు నిబంధనలు తుంగలో తొక్కి భూముల క్రయవిక్రయాలు జరుపుతున్నారు. ఏజెన్సీలో అమల్లో ఉన్న 1/70చట్టంతో పాటు పీసా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. చట్టాలను కఠినంగా అమలు చేసి ఏజెన్సీ భూములను సంరక్షించాల్సిన రెవెన్యూ, పంచాయతీ అధికారులు అటు వైపు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇందులో కొందరు అధికారుల అండదండలతోనే ఈ తతంగం సాగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారుతున్నాయి. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వెంచర్లపై 'నవతెలంగాణ' ప్రత్యేక కథనం..
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు భూముల క్రయవిక్రయాలు జరపడం చట్టరీత్యా నిషేదం. ఏజెన్సీ ప్రాంతంలో 1970కి ముందు భూములు కొనుగోలు చేసిన వారికే భూ పట్టా ఉంటుంది. తర్వాత కొనుగోలు చేసిన గిరిజనేతరులకు ఎల్.టీ.ఆర్ చట్టం కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. 1/70 చట్టం ప్రకారం గిరిజనేతరులు భూ క్రయ, విక్రయాలు చేయడం చట్టరీత్యా నిషిద్ధం. ఇంద్రవెల్లి మండలంలో మాత్రం ఆ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. మండల శివారులోని సర్వే.నెం.243తో పాటు హార్కాపూర్, ఈశ్వర్‌నగర్, ధనోర(బి), ఏమాయికుంట తదితర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములను కొందరు రియల్టర్లు అక్రమంగా ప్లాట్లుగా మారుస్తున్నారు. ఒక్కో ప్లాటును రూ.15లక్షల నుంచి రూ.17లక్షల వరకు విక్రయించి రూ.కోట్లలో అక్రమంగా ఆర్జిస్తున్నారు. భారీగా స్థిరాస్తులను కూడబెడుతున్నారు. ఎలాంటి నాలా రుసుముతో పాటు పంచాయతీ అనుమతులు లేకుండా ఈ అక్రమ దందా చాపకింద నీరులా కొనసాగుతోంది. ఒకవేళ అనుమతి తీసుకున్న భూముల్లో ప్లాట్లు చేయాలంటే నిబంధనల ప్రకారం కచ్చితంగా 10శాతం భూమిని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. 16ఫీట్ల రోడ్డు, ప్రభుత్వ పాఠశాల, ఇతర అవసరాలకు ఈ భూమిని కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఏజెన్సీ ప్రాంతంలో భూములు కొనుగోలు, అమ్మకం ప్రక్రియనే నిషేదంలో ఉంది. అలాంటప్పుడు ఇందులో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి కూడా అధికారికంగా రిజిస్ట్రేషన్లు కావు. కానీ స్థానిక పంచాయతీ నుంచి అనుమతి తీసుకొని ఇంటి నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యధేచ్ఛగా పీసా చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. భూ క్రయవిక్రయాలు జరిగితే పీసా కమిటీ అనుమతులు లేనిదే ముట్టుకొనే వీలుండదు. అది కూడా ఇక్కడి గిరిజనులకే ఆ హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ రియల్ దళారులు మాత్రం ఆయా చట్టాలను కాలరాసి నిబంధనలు విస్మరిస్తున్నారు. ప్లాట్ల ధరలు విపరీతంగా పెంచి విక్రయించడం ద్వారా గిరిజనులకు ఆవాసం కోసం స్థలం కరువయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అక్రమార్కుల ధనదాహం కారణంగా పచ్చని పంట పొలాలు కనిపించకుండాపోయే ప్రమాదం తలెత్తింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఏజెన్సీలో రియల్ దందా ఆగడాలకు అడ్డకట్ట వేయాలని గిరిజనులు కోరుతున్నారు.
రియల్ దందా ఆపకపోతే ఆందోళన చేస్తాం :
సెడ్మకి రామారావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు
ఏజెన్సీలో జరుగుతున్న ఆక్రమ భూ దందాకు రెవెన్యూ, పంచాయతీ అధికారులు అడ్డుకట్ట వేయాలి. సంబంధిత అధికారులు మామూళ్లకు ఆశపడి గిరిజన చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు. వెంటనే వీటిని ఆపకపోతే ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేస్తాం. అయినా కొనసాగితే ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతాం.
అధికారులు చర్యలు తీసుకోవాలి
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఏస్టేట్ వ్యాపారం జరుగుతోంది. 1970 తర్వాత నుంచి ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలను పూర్తిగా నిషేధించింది. గిరిజనులు భూమి కొనుగోలు చేయాలన్నా కలెక్టర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయ భూములను ప్లాట్లుగా మారుస్తున్నట్టు మా దృష్టికీ వచ్చింది. ఇలాంటి వాటితో భవిష్యత్తులో గిరిజనుల అస్తిత్వానికి ముప్పు ఏర్పడుతుంది. అధికారులు వెంటనే వీటిపై దృష్టి సారించి ఏజెన్సీ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలి. లేనిపక్షంలో ఆందోళన చేపడతాం.
- తొడసం భీంరావు, టీఏజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి