Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంయుక్త కిసాన్‌మోర్చా నిరసనలో ప్రజా సంఘాల నేతల పిలుపు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాత పూర్వకంగా ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమైందనీ, రైతులందరికీ కనీస మద్దతు ధరను గ్యారంటీ చేస్తూ చట్టం చేసేందుకు సెలెక్ట్ కమిటీని నియమించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మపాల్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, ఏఐఎంకేఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో జాతీయోద్యమం తర్వాత మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటం జరిగిందనీ, ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను ఉపసంహరించుకున్నదని గుర్తుచేశారు. ఆ పోరాట అనుభవంతో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం సాధించడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని మోడీ హామీ ఇచ్చారనీ, ఆ తర్వాత విస్మరించారని తెలిపారు. దేశంలో ప్రతి ఏడాదీ 13 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి నివారణకు కేరళ తరహా రుణ విమోచన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రయివేటు శక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదనీ, దాంతో సన్న, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తుల నుంచి వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవాలని సూచించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రయివేటు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు పూనుకుంటున్నదన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరగడం వల్ల రైతులతోపాటు సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజానీకంపై మోయలేని భారం పడుతున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక, కర్షక మైత్రితో అన్ని తరగతుల ప్రజలను కలుపుకుని భవిష్యత్‌లో ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్, ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అబ్బాస్, సీఐటీయూ నాయకులు భూపాల్, ఎస్వీ.రమ, జయలక్ష్మి, కూరపాటి రమేష్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండీ.సర్దార్, ఆవాజ్ నగర కార్యదర్శి సత్తార్, తదితరులు పాల్గొన్నారు.