Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నా భర్త ఇంటికి క్షేమంగా రావాలి..
- చిన్న పాప ఉంది.. ఏమో అయ్యింది..
- బిక్కుబిక్కుమంటూ మీడియాతో మాట్లాడిన భార్గవి
నవతెలంగాణ-భువనగిరి
''నిజం చెప్పండన్నా.. నా భర్తకి ఏమీ కాలేదు కదా.. క్షేమంగా ఇంటికి రావాలి.. నాకు చిన్న పాప ఉంది.. మా నాన్న మంచి వాడు నా క్షేమం కోసమే ప్రేమ వివాహం వద్దన్నాడు.. నా భర్త దెబ్బలు తిని వస్తే చాలు..'' అంటూ అమాయకత్వం.. బిత్తరచూపులతో.. జీరబోయిన గొంతుతో.. ఏడుస్తూ.. మీడియాను భార్గవి ప్రశ్నించింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ, భార్గవి కులాంతర వివాహం చేసుకోవడంతో అమ్మాయి తండ్రి రామకృష్ణను హత్య చేయించిన విషయం తెలిసిందే. అమ్మాయి తండ్రి పల్లెపాటి వెంకటేష్, సుపారీ తీసుకున్న లతీఫ్‌తో పాటు మరో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిన రామకష్ణ ఆదివారం విగతజీవిగా గుర్తించడంతో స్వగ్రామంలో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ భార్య భార్గవి మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం వెళ్ళిన తన భర్త రామకృష్ణ సాయంత్రం నాలుగు గంటలయినా రాకపోవడంతో తాను తను గాభరా చెందినట్టు తెలిపారు. దాంతో పది నిమిషాలకు ఒకసారి ఫోన్ చేశాననీ, ఫోన్ రింగ్ కాకపోవడంతో అనుమానం వచ్చిందన్నారు. ఆందోళనతో తన భర్త స్నేహితుడైన చెప్పుల షాప్ యజమాని మహేష్‌కు ఫోన్ చేయడంతో అతను రాలేదని చెప్పాడని తెలిపారు. దాంతో తన స్నేహితురాలితో తిమ్మాపురం సర్పంచ్ భార్య ఫోన్ నెంబర్ తీసుకొని ఆమెకు ఫోన్‌చేశానని, తన భర్త గురించి అడిగితే.. ఇంకా రాలేదా అని తననే తిరిగి ప్రశ్నించారని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు పలుమార్లు ఫోన్ చేశారన్నారు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అదేరోజు యాదగిరిగుట్టలోని గాయత్రి మెస్‌లో లతీఫ్ గ్యాంగ్ భోజనం చేసినట్టు పోలీసులు తెలిపారనీ, లతీఫ్ వాడిన కారు దొరికితే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారని తెలిపారు. తాను భువనగిరి వైష్ణవి కళాశాలలో ఇంటర్ చదువుతున్నప్పుడు నుంచి రామకృష్ణతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. డిగ్రీ చదువుతున్నప్పుడు తన స్నేహితుల ద్వారా మా ప్రేమ విషయం తన తండ్రికి తెలిసిందన్నారు. తమ పరువుతీయొద్దని తన తండ్రి మందలించినట్టు తెలిపారు. ఈ విషయం రామకృష్ణకు చెప్పడంతో.. ఇంట్లో నుంచి బయటకొచ్చి పెండ్లి చేసుకున్నామన్నారు. తన తండ్రి పరువు తీశానని తనకి ఎప్పుడూ ఫోన్ చేయలేదన్నారు.. ఇలా మీడియాతో మాట్లాడుతుండగానే.. ఇంట్లో నుంచి వస్తున్న ఏడుపులు విన్న భార్గవి.. కంటతడి పెడుతూ 'ఏమయింది అన్న... నాకు చెప్పట్లేదు' అంటూ మీడియా ముందు బోరున విలపించింది.