Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాణిక్కం ఠాగూర్ స్పష్టీకరణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందనే ప్రచారం అవాస్తవం, అబద్ధమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ఈ తప్పుడు ప్రచారాన్నీ వాళ్లే (టీఆర్‌ఎస్) చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలపై చేస్తున్న పోరాటంలో తమ పార్టీ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గబోదని హెచ్చరించారు. మే ఆరున వరంగల్‌లో నిర్వహించే సభ ద్వారా తమ బలమేంటో నిరూపిస్తామని ఆయన పేర్కొన్నారు.
పార్టీ పదవుల్లో ఎలాటి నియామకాలు చేపట్టకూడదు
ఇటీవల చేపట్టినవీ చెల్లవు : మహేష్‌కుమార్‌గౌడ్
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో పార్టీలోనూ, అనుబంధ విభాగాల్లోనూ ఏ స్థాయిలో కూడా ఎలాంటి నియామకాలు జరపొద్దని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల కాలంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదల య్యాక జరిపిన అన్ని నియామకాలు చెల్లవనీ, సంస్థాగత ఎన్నికల తర్వాత అన్ని నియామకాలు మళ్ళీ చేపడతామని పార్టీ శ్రేణులకు వివరించారు.
తల్లీ కొడుకుల కుటుంబానికి అండగా ఉంటాం : రేవంత్
రామయంపేటకు చెందిన గంధం పద్మ, గంధం సంతోష్ తల్లీకొడుకులు శనివారం ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులతో టీపీసీసీ అధ్యక్షులు, ఎనుముల ఎంపీ రేవంత్‌రెడ్డి ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి దోషులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తామని సంతోష్ తండ్రి అంజయ్య, సోదరుడు శ్రీధర్‌కు ధైర్యం చెప్పారు. టీఆర్‌ఎస్ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయనీ, తమకు న్యాయం చేయాలనీ, ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారని వారు రేవంత్‌కు వివరించారు.