Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలకలం రేపిన మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య
- సిద్దిపేట జిల్లా లకుడారంలో బయటపడ్డ మృతదేహం
- పోలీసుల అదుపులో లతీఫ్ గ్యాంగ్
- ప్రేమ వివాహం చేసుకున్న రామకృష్ణ, భార్గవి
- కిడ్నాప్ చేసి హత్య చేయించిన మామ వెంకటేష్
నవతెలంగాణ -భువనగిరి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరోమారు కులదురహంకార హత్య కలకలం రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అదృశ్యమైన సస్పెండెడ్ హౌంగార్డు రామకృష్ణ మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా కుక్కునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. రామకృష్ణది కులదురహంకార హత్యగా పోలీసులు భావిస్తున్నారు. మామ వెంకటేష్ అతన్ని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, రామకృష్ణ భార్య భార్గవి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి లతీఫ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు భువనగిరి ఏసీపీ వెంకట్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ, యాదగిరిగుట్టలో హోంగార్డుగా పనిచేస్తున్న సమయంలో వీఆర్‌ఏ పల్లెపాటి వెంకటేష్‌తో రామకృష్ణకు స్నేహం ఏర్పడింది. వారిద్దరూ కలిసి భూ దందాలకు శ్రీకారం చుట్టారు. పోలీసు శాఖలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో రామకృష్ణ వెంకటేష్ కుమార్తెను తరచుగా కళాశాల వద్ద దింపి రావడంతో వారిద్దరి మధ్య ప్రేమ మొదలై వివాహం వరకు దారి తీసింది. ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో వీరి ప్రేమను భార్గవి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దాంతో వారిద్దరూ ఆగస్టు 16, 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెండ్లి ఇష్టం లేని అమ్మాయి తండ్రి వెంకటేష్.. వారితో గొడవలు కూడా పెట్టుకొని భార్గవిని తిరిగి రమ్మని ఒత్తిడి చేశాడు. దాంతో రామకృష్ణ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకున్నాడు. అప్పటినుంచి వీరితో అమ్మాయి కుటుంబానికి ఎలాంటి రాకపోకలు లేవు. సుమారు ఆరు నెలల కింద రామకృష్ణపై గుప్తనిధుల ఆరోపణలు రావడంతో విధుల నుండి సస్పెండయ్యాడు. దాంతో 8 నెలల కిందట రామకృష్ణ దంపతులు భువనగిరి పట్టణానికి తమ నివాసాన్ని మార్చారు. అప్పటి నుంచి రియల్‌ఎస్టేట్ భూ సెటిల్మెంట్లపై దృష్టి సారించాడు. ఇదే అదనుగా భావించిన భార్గవి తండ్రి వెంకటేష్ లతీఫ్ గ్యాంగ్‌తో మంతనాలు జరిపి సుఫారీ ఇచ్చాడు. లతీఫ్ గ్యాంగ్ భూమి కొనుగోలు నిమిత్తం రామకృష్ణను కలిసి రూ.5వేలు బయానాగా కూడా చెల్లించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం లతీఫ్‌కు భూమి చూపించాలని తిమ్మాపూర్ సర్పంచ్ భర్త అమృతరావుతో కలిసి ఇంటి నుంచి వెళ్లాడు. శనివారం ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆమె భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ జరిపి ఆమె తండ్రి వెంకటేష్‌తో పాటు లతీఫ్ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరపగా మోత్కూరు, గుండాల మండలం మధ్యలోని జమ్మిచెట్టు వద్ద రామకృష్ణను హత్య చేసి సిద్ధిపేట జిల్లా లాకుడారం గ్రామం సమీపంలోని రాజీవ్ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న రైల్వేట్రాక్ ఐదో బ్రిడ్జి పనులు వద్ద మృతదేహాన్ని మట్టిలో పూడ్చినట్టు వారు తెలిపినట్టు వెల్లడించారు. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లి పూడిక తీసి మృతదేహాన్ని వెలికితీసినట్టు ఏసీపీ తెలిపారు.