Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మంలో దుర్గాదేవికి తుది వీడ్కోలు.. అంతిమయాత్ర
- హైదరాబాద్‌లో రాఘవులు, తమ్మినేని, తుమ్మల తదితరులు నివాళి
- ఆమె ఆశయ సాధనే నిజమైన నివాళి
- దుర్గాదేవి సంస్మరణ సభలో వామపక్ష, ఇతర రాజకీయ పార్టీల నేతలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
'' నేలను విడిచి నింగిన చేరిన
అరుణ తారవమ్మా...ఐద్వా జెండా సమున్నతంగా
ఎగరేసిన నీవమ్మా... అమ్మా దుర్గమ్మా విప్లవ జోహార్లు.. తల్లీ దుర్గమ్మా అరుణ అరుణ వందనాలు...'' అని స్మరిస్తూ ప్రజానాట్య మండలి కళాకారులు గీతాలాపన చేయగా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొండపల్లి లక్ష్మీనర్సింహారావు సతీమణి, ఐద్వా, సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్ నాయకురాలు కొండపల్లి దుర్గాదేవి సంస్మరణ సభలో ఆమెతో అనుబంధం ఉన్న వామపక్ష పార్టీలు, వివిధ పార్టీల నేతలు ఘనంగా నివాళి అర్పించారు. అనారోగ్యంతో దుర్గాదేవి మంగళవారం హైదరాబాద్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె భౌతికకాయాన్ని బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని చాకలి ఐలమ్మ ట్రస్టు భవన్(ఐద్వా భవన్)లో కొద్దిసేపు ఉంచి.. తర్వాత మధ్యాహ్నం ఖమ్మంలోని సీపీఐ(ఎం) కార్యాలయానికి తరలించారు. అక్కడ ప్రజల సందర్శన అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటైన దుర్గాదేవి సంస్మరణ సభలో పలువురు వక్తలు మాట్లాడారు. మహిళా ఉద్యమంలో దుర్గాదేవి ప్రస్థానాన్ని వివరించారు. 1933 ఏప్రిల్ 10వ తేదీన సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినా ఆమె తండ్రి నేదునూరి రాఘవరావు, భర్త కెఎల్ నర్సింహారావు స్ఫూర్తితో మహిళా ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. పుణ్యవతి, బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, సాయిబాబు తెలిపారు. అసమానతలు లేని సమాజం కోసం దుర్గాదేవి పాటుపడ్డారని అన్నారు. కేఎల్ ఏరకంగా నీతినిజాయితీగా సేవలందించారో దుర్గాదేవి కూడా అదే పంథాలో నడిచారన్నారు. నిబద్ధత కలిగిన నాయకురాలిగా గుర్తింపు పొందారని, ఆమె ఆశయ సాధనకు పనిచేయడమే నిజమైన నివాళి అని అన్నారు. నిరంతరం కమ్యూనిస్టులు బలపడాలని ప్రోత్సహించేవారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు, బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో మణిపూస లాంటిది దుర్గాదేవని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. దుర్గాదేవితో అనుబంధాన్ని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ గుర్తు చేసుకున్నారు. కేఎల్ కుటుంబం నాటి విద్యార్థి, యువజనులకు ఓ స్ఫూర్తి అని కొనియాడారు. మహిళా సంఘం విస్తరణలో దుర్గాదేవితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఐద్వా రాష్ట్ర నాయకురాలు బత్తుల హైమావతి కంటతడి పెట్టారు. కమ్యూనిస్టు చరిత్రలో తనకంటూ ఓ పేజీ లిఖించు కున్నారని మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి, పీవోడబ్ల్యూ జిల్లా నాయకురాలు ఝాన్సీ పేర్కొన్నారు. దుర్గాదేవి పెద్దకుమారుడు ఉత్తమ్‌కుమార్‌తో కేఎల్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని ఐలూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి సత్యనారాయణ నెమరువేసుకున్నారు. అమ్మ మరణంతో ఒక బంధం తెగిపోతుందని ఆమె చిన్నకుమారుడు పావన్ అన్నారు. అమ్మ ఆశయాల కోసం పాటుపడటమే ఆమెకు మనమిచ్చే నివాళి అని అన్నారు. కుటుంబ సభ్యులను వేదికకు పరిచయం చేశారు. జైపాల్, రాహుల్, సాహితి, ఇతర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వామపక్ష వాదులు, అనుబంధం ఉన్నవారంతా దుర్గాదేవికి తుది వీడ్కోలు పలికారు. ఈ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, మాచర్ల భారతి, సీనియర్ నాయకులు పి.సోమయ్య, కాసాని ఐలయ్య, రాజారావు, ఐద్వా రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ, జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వర్లు, భూక్యా వీరభద్రం, పొన్నం వెంకటేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్లు కమర్తపు మురళి, బుర్రి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పరకాల నాగన్న, జనసేన ఏపీ రాష్ట్ర నాయకులు ఈశ్వరయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్లూరి జీవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
దుర్గాదేవికి తుది వీడ్కోలు...
దుర్గాదేవి అంతిమయాత్ర సుందరయ్య భవనం నుంచి ప్రారంభ మైంది. ఐద్వా, మహిళా నాయకురాళ్లు దుర్గాదేవి పాడెను భుజస్కంధాలపై మోస్తూ ఆమెకు వీడ్కోలు పలికారు. వామపక్ష వాదులు మోటార్‌సైకిల్ ర్యాలీతో ఆమె అంతిమయాత్ర రథాన్ని అనుసరించారు. స్థానిక కాల్వడ్డులోని హిందూ శ్మశాన వాటికలో ఆమె దహన సంస్కారాలు చేశారు.
ఐద్వా ఆఫీసులో నేతల నివాళి
హైదరాబాద్ ఐద్వా కార్యాలయంలో బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు దుర్గాదేవి భౌతికకాయాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పొలిటోబ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శివర్గసభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, పార్టీ సీనియర్ నేతలు, ఐద్వా, ఇతర ప్రజాసంఘాల నేతలు దుర్గాదేవికి ఘనంగా నివాళి అర్పించారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మహిళా ఉద్యమంలో ఆమె చేసిన కృషిని కొనియాడారు. దుర్గాదేవి భౌతికకాయంపై సీపీఐ(ఎం) జెండాను రాఘవులు ఉంచారు. అదేవిధంగా మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రజా కవి జయరాజ్, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు రామచంద్రమూర్తి, తెలకపల్లి రవి, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు నాయకులు రజనీ, ఎస్‌యుసీఐ నాయకులు రమా, తదితర వామపక్ష, రాజకీయ, ప్రజాసంఘాల నేతలు నివాళి అర్పించారు.