Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాది
- మీ బాధ్యతలు నిర్వహించండి
- గవర్నర్‌పై మంత్రి తలసాని విమర్శలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
'రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్‌మీట్లు పెట్టి నిందించటం సరికాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు మావి. నామినేటెడ్ వ్యక్తులం కాదు. రాజకీయ పార్టీల వ్యక్తిలా మాట్లాడటం మంచిది కాదు. ఈ ముఖ్యమంత్రితో పనిచేయటం ఇష్టం లేదని చెప్పటం సరికాదు. ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదు. రాజకీయపరమైన మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపైన ఆరోపణలు సరికాదు. ఉపరాష్ట్రపతి కన్నా గవర్నర్ అనే రోల్ చాలా తక్కువ. మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వారే ప్రొటోకాల్ విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పారు. అది కూడా గవర్నర్ తెలుసుకుని మాట్లాడాలి' అంటూ గవర్నర్ తమిళిసై పై రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు చేశారు. ఈనెల 27 జరిగే పార్టీ ఫ్లీనరీపై హైదరాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ నేతలతో టీఆర్‌ఎస్ భవన్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాజ్యాంగ పరమైన విధానంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు పని పాట లేదని, పొద్దున లేస్తే సోషల్ మీడియాలో ప్రచారం తప్ప వేరే పని లేదని విమర్శించారు. గులాబీ జెండాను ప్రజలు సొంత జెండాగా భావిస్తున్నారని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో గిల్లి కజ్జాలు పెడుతూ రెచ్చగొడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు పాదయాత్రలు చేసినా.. ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా అభివృద్ధి సాధించిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్ అని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి 21 ఏండ్లు పూర్తయిందన్నారు. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అన్ని బస్తీలు, డివిజన్‌లలో తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. 27వ తేదీన హెచ్‌ఐసీసీలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్లీనరీ నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 3వేల మంది ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానాలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో హౌంమంత్రి మహమూద్‌అలీ, మేయర్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షులు మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎంఎస్ ప్రభాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మెన్లు గజ్జెల నగేష్, రావుల శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, నియోజకవర్గ ఇంఛార్జిలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.