Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలియాబాద్(శామీర్‌పేట)లో 4.8 సెంటీమీటర్ల వాన
- జైనధ్‌లో 44.9 డిగ్రీల ఎండ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గురువారం మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. పలు చోట్ల గాలి దుమారం, ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం అలియాబాద్‌లో అత్యధికంగా 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలుచోట్ల రెండు సెంటీమీటర్లకుపై వర్షం కురిసింది. రాష్ట్రంలో మొత్తంగా 78 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల(గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం)తో కూడిన వానలు కూడా పడే అవకాశం ఉందని వివరించారు. దక్షిణ, నైరుతి దిశల నుంచి తెలంగాణ మీదుగా కిందిస్థాయిలో గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా జైనధ్‌లో అత్యధికంగా 44.9 డిగ్రీల ఎండ కాసింది. ఆదిలాబాద్, కుమురంభీమ్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, జయశంకర్‌భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, జన గాం, మహబూబాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీలపై ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.