Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట రక్షణకు వేసిన విద్యుత్ తీగ
నవతెలంగాణ- తాంసి
రైతు పండించిన పంటను అడవి పందుల బారి నుంచి కాపాడుకోవడానికి జొన్న పంట చుట్టూ అమర్చిన విద్యుత్ తీగ తన ప్రాణాన్నే బలిగొన్నది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం జామిడి గ్రామంలో గురువారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు సురికుంటి కమలాకర్‌రెడ్డి(27) తన పంట పొలంలో రబీ సీజన్‌లో జొన్న పంట సాగుచేస్తున్నాడు. కోతకు వస్తున్న జొన్న పంటను అడవి పందుల బారి నుంచి కాపాడుకోవడానికి పొలం చుట్టూ విద్యుత్ తీగ అమర్చాడు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం 5గంటలకు ఇంటి నుంచి జొన్న పంటకు నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. విద్యుత్ తీగను మర్చిపోయి మోటార్ స్టార్ట్ చేసి స్ప్రింక్లర్ పైపు సరిచేయడానికి చేనులోకి వెళ్లగా కాళ్లకు తీగ తగలడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. తండ్రి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో పొలానికి వెళ్లి చూశాడు. కొడుకు విగతజీవిగా పడి ఉండటంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ ధనశ్రీ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. మృతునికి ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. పుట్టిన రోజు సంబరం చూడకుండానే తండ్రి మరణించడంతో కుటుంబీకులు, భార్య నిఖిత రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.