Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పచ్చదనం పెంపే తొలి ప్రాధాన్యత
- హరితహారం సీజన్‌కు సిద్ధంగా ఉండాలి
- అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్‌ఎం. డోబ్రియల్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీ రక్షణకు ప్రాధాన్యతను ఇస్తూనే, క్షీణించిన అటవీ పునరుద్దరణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలనీ, రాష్ట్ర మంతటా పచ్చదనం పెంచటమే తొలి ప్రాధాన్యంగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది పనిచేయాలని రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్‌ఎం.డోబ్రియల్ ఆదేశించారు. రానున్న ఏడాది కాలంలో అటవీ శాఖ తరపున చేపట్టాల్సిన పనులు, విధివిధానాల రూపకల్పనపై ఉన్నతాధికారులు, రెండు టైగర్ రిజర్వుల ఫీల్డ్ డైరెక్టర్లు, పది సర్కిళ్ల చీఫ్ కన్జర్వేటర్లతో అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్యభవన్‌లో వర్క్‌షాపును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డోబ్రియల్ మాట్లాడుతూ..తెలంగాణకు హరితహారం ద్వారా చేపట్టిన పనులు, ఫలితాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదల, ప్రభుత్వ ప్రోత్సాహం, అటవీ శాఖలో ప్రతి ఒక్కరి కృషి వల్లనే దేశస్థాయిలో గౌరవం లభిస్తున్నదని చెప్పారు. వచ్చే నెలలో మొదలయ్యే పల్లె, పట్టణ ప్రగతితో పాటు, రానున్న సీజన్ హరితహారం కోసం ముందస్తు ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున అగ్ని ప్రమాదాల నివారణలో క్షేత్ర స్థాయి సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలకు అటవీ భూమి మళ్లింపు తప్పనిసరి అయినప్పుడు ప్రభుత్వ ప్రాధామ్యాలకు అనుగుణంగా అనుమతుల ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఆయా శాఖలతో సమన్వయం చేసుకుని ప్రత్యామ్నాయ అటవీకరణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. వన్యప్రాణుల కోసం రెండు పులుల అభ యారణ్యాల్లో గడ్డి మైదానాల పెంపునకు (గ్రాస్‌ప్లాట్స్) ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ది చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కుల పనులను వేగంగా పూర్తి చేసి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా కృషిచేయాలన్నారు. అటవీ శాఖలో పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతమయ్యేలా టీపీఎస్సీకి సహకారం అందించాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (అడ్మిన్) స్వర్గం శ్రీనివాస్, అదనపు పీసీసీఎఫ్‌లు వినరు కుమార్, ఎంసీ.పర్గెయిన్, ఎస్‌కే.సిహ్హా, ఫారెస్ట్ అకాడెమీ డైరెక్టర్ రాజారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.