Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీ అయ్యకంటే నేనెక్కువ మాట్లాడుతా..:
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి
- మే6న రైతు సంఘర్షణ సభ
నవతెలంగాణ-సుబేదారి
'వరంగల్ సభలో బుధవారం మంత్రి కేటీఆర్ మాట్లాడిన భాషను అందరూ ఖండించాలి. నేను మాట్లాడితే... మీ అయ్యకంటే ఎక్కువగా మాట్లాడుతా.. కానీ, నాకు సంస్కారం ఉంది. కేసీఆర్ సభ కంటే ఒక తల ఎక్కువగా వచ్చేలా నేను సభ నిర్వహిస్తాను.' అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం హన్మకొండలోని సుబేదారి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్‌లో మే6న రైతు సంఘర్షణ సభ నిర్వహణకు నిర్వహించిన సన్నాహక సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. నాడు నవాబుల పైజామా తడిచేలా రైతు సాయుధ పోరాటం చేసిన దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కొమురం బీమ్ లాంటి అమరవీరుల స్ఫూర్తితో వరంగల్‌లో రైతు సంఘ ర్షణ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం సోనియాగాంధీ ఆదేశాలతో తెలంగాణలో రైతులతో సభను పెడుదామని చెబితే ఓరుగల్లు పోరుగల్లులో నిర్వహించాలని రాహుల్ గాంధీ సూచించారన్నారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి రాహుల్ గాంధీ వస్తున్నారని తెలిపారు. తెలంగాణకు విముక్తి కలిగేలా కేయూ విద్యార్థులు, ప్రజలు, యువత, మేధావులు ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 22మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ కనీసం పరామర్శించలేదన్నారు. కేటీఆర్ భాష సరిదిద్దుకోవాలని సూచించారు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ మాట్లాడుతూ.. కేటీఆర్ గతంలో ఏదైనా వ్యాపారం ఉంటే చెప్పు అని తనతో ఫ్లైట్‌లో పక్కనే కూర్చుని బతిమాలాడని, నేడు వేల కోట్లు వెనకేసుకొచ్చాడ న్నారు. స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తమ్ముడు కేటీఆర్ చాలా చిన్నవాడని, కానీ, కాంగ్రెస్‌నే విమర్శిస్తున్నాడన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్‌రెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, అంజన్‌కుమార్ యాదవ్, సిరిసిల్ల రాజయ్య, కొండా మురళి, వేం నరేందర్ రెడ్డి, జంగా రాఘవ రెడ్డి, సీతక్క, వరద రాజేశ్వరరావు పాల్గొన్నారు.