Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో ఇతరులకూ వైద్యం
- రెండు నెలల్లో 1,060 బస్సుల కొనుగోళ్లు ొ కార్గో విస్తరణ
- త్వరలో కారుణ్య నియామకాలు
- టీఎస్‌ఆర్టీసీ పాలకమండలి నిర్ణయాలు
- స్వరాష్ట్రంలో తొలి సమావేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ యాజమాన్యం వివిధ రకాల సెస్సుల విధింపుతో పెరిగిన టిక్కెట్ చార్జీలను ప్రయాణీకులు ఆమోదించినట్టు టీఎస్‌ఆర్టీసీ పాలకమండలి (బోర్డు) అభిప్రాయపడింది. పెరిగిన డీజిల్, పెట్రోల్ రేట్ల వల్ల చార్జీలు పెంచాల్సి వచ్చిందనే విషయాన్ని ప్రయాణీకులు అర్థం చేసుకున్నారనీ, తాము భయపడినట్టు బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) ఏమీ తగ్గలేదని కూడా బోర్డు పేర్కొంది. టిక్కెట్ మూల ధర పెంపుపై మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత సెస్‌ల విధింపు వల్ల సంస్థకు దాదాపు రూ.30 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్టు అధికారులు బోర్టుకు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు కేవలం ఆర్టీసీ కార్మికుల వైద్య సేవలకే పరిమితమైన తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా అప్‌గ్రేడ్ చేసి, ఇతరులకు కూడా వైద్యసేవలు అందించాలని నిర్ణయించారు. అయితే దీని నిర్వహణను ప్రయివేటుకు అప్పగించాలా లేక ప్రభుత్వ సహకారంతో యాజమాన్య వాటాను ఏర్పాటు చేసుకొని, సెమీ గవర్నమెంట్ ఆస్పత్రిగా మార్పు చేయాలా అనే అంశంపై బోర్డు సమావేశంలో స్పష్టత రాలేదు. ఈ అంశాన్ని మరోసారి విస్త్రుతంగా చర్చించాలని నిర్ణయించారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్లలో ఫార్మసీల నిర్వహణకు బోర్డు ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి టీఎస్‌ఆర్టీసీ బోర్డు సమావేశం జరిగింది. 2013లో చివరి బోర్డు మీటింగ్ జరిగింది. ఆ తర్వాతి నుంచి టీఎస్‌ఆర్టీసీకి పూర్తి బోర్డు ఏర్పాటు కాలేదు. ఇప్పుడు కూడా బోర్డులో తొమ్మిది మంది సభ్యులే ఉన్నారు. కార్మిక సంఘాల ప్రతినిధులకు బోర్డులో స్థానం కల్పించలేదు. శనివారం జరిగిన బోర్డు సమావేశం చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ అధ్యక్షతన జరిగింది. 9 మంది సభ్యుల్లో చైర్మెన్‌తో సహా ఏడుగురు హాజరయ్యారు. మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్, కార్మిక, ఉపాధి కల్పనాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, కేంద్ర రవాణాశాఖ డైరెక్టర్ పరేష్‌కుమార్‌గోయల్, ఇంజినీర్ ఇన్ చీఫ్ పీ రవీందర్ హాజరయ్యారు. సుదీర్ఘకాలంగా సంస్థలో కారుణ్య నియామకాలు చేపట్టనందువల్ల దాదాపు 1,200 మంది కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయనీ, త్వరలో వాటిని చేపట్టాలని నిర్ణయించారు. రెండు నెలల్లో ఏసీ, నాన్ ఏసీ, స్లీపర్ క్లాస్‌కు చెందిన 1.060 బస్సులు కొనుగోలు చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. సమావేశంలో ఉమ్మడి రాష్ట్ర నిర్ణయాలపైనా అంశాల వారీగా చర్చించారు. కార్గో విస్తరణతోపాటు ఆర్టీసీ నష్టాలపైనా సుదీర్ఘ చర్చ జరిగింది. ఆర్టీసీ ఖాళీ స్థలాలు, కమర్షియల్ అంశాలపైనా చర్చించారు. యాజమాన్యం ఇప్పుడు తీసుకుంటున్న చర్యల వల్ల సంస్థ త్వరలోనే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతుందనే ఆశాభావాన్ని బోర్డు సభ్యులు వెల్లడించారు. గడచిన ఏడేండ్ల జమా ఖర్చుల లెక్కలకు ఆమోదం తెలిపారు. వీటికి ఆమోదం లభించడం తో బ్యాంకుల నుంచి కొత్తగా రుణాలు తీసుకొనేందుకు వెసులుబాటు కలుగుతుందని బోర్డు అభిప్రాయపడింది. కరోనా విపత్కర పరిస్థితులు, సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ తెచ్చేందుకు ఆర్టీసీ డ్రైవర్లు ఓడిస్సా వెళ్లి రావడంపైనా సమావేశంలో చర్చ జరిగింది. కేవలం ప్రయాణాలపైనే ఆధారపడకుండా ఇతర మార్గాల్లోనూ అదనపు ఆదాయం కోసం ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని పాలకమండలి భావించింది. డీజిల్ భారం నుంచి గట్టేక్కేందుకు ఆర్టీసీలో ఉన్న బస్సులనే ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పు చేస్తూ పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టినట్టు సంస్థ ఎమ్‌డీ వీసీ సజ్జనార్ బోర్డు దృష్టికి తీసుకొచ్చారు. అయితే వీటిలో టెక్నికల్‌గా అనేక సమస్యలు వచ్చాయనీ, వాటిని పరిష్కరించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నామనీ చెప్పారు. సీఎన్‌జీ బస్సుల కొనుగోలుపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బోర్డు సమావేశ అజెండాలో ఏడేండ్లకు సంబంధించిన దాదాపు 300 అంశాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మినహా మెజారిటీ అంశాలకు బోర్డు ఆమోదం తెలిపింది.