Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి అజరును ఇరకాటంలో పెట్టేందుకే ఆ కుట్ర
- టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ప్రశాంతమైన ఖమ్మం జిల్లాలో మత విద్వేషాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. అందుకే బీజేపీ నేతలు ఇక్కడికి యాత్రలు చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి చేశారని తెలిపారు. అది చూసి ఓర్వలేకనే శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు. సాయి అనే వ్యక్తిని బీజేపీ వాళ్లే రెచ్చగొట్టి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జిల్లాకు వచ్చినప్పుడు అభివృద్ధిపై మాట్లాడకుండా శవరాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. రేణుకాచౌదరి మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో ఏం అభివృద్ధి చేశారో బహిరంగంగా చెప్పాలని సవాల్ విసిరారు. సాయి చనిపోయినప్పుడు విచారణ చేపట్టాలని మొదట టీఆర్‌ఎస్ పార్టీయే కోరిందని గుర్తుచేశారు. మంత్రి పువ్వాడ అజరును ఇరకాటంలో పెట్టేందుకే బీజేపీ, కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాబోయే రోజుల్లో జిల్లాలో ఈ పార్టీలకు పుట్టగతులుండవన్నారు. సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, జెడ్పీ చైర్మెన్ లింగాల కమల్‌రాజ్, డీసీసీబీ చైర్మెన్ కూరాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మెన్ బచ్చు విజరుకుమార్, మార్కెట్ కమిటీ చైరర్మెన్ లక్ష్మీప్రసన్న, టీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు పాల్గొన్నారు.