Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వే బడ్జెట్‌ను పునరుద్ధరించాలి
- బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైల్వే బడ్జెట్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో కలపడం సరైంది కాదన్నారు. రైల్వేరంగాన్ని ప్రయివేటుపరం చేయొద్దని కోరారు. శనివారం సికింద్రాబాద్‌లోని రైల్ కళారంగ్‌లో జరిగిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగుల జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ గతంలో మాదిరిగానే రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగా పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. సాధారణ బడ్జెట్‌లో కలపడం వల్ల అంతా ఆగమ్యగోచరంగా మారిందన్నారు. ప్రత్యేక బడ్జెట్ ఉంటే కొత్త రైళ్లు ఎన్ని, కొత్త రూట్లు ఎన్ని వస్తున్నాయనే సమగ్ర వివరాలు వస్తాయని సూచించారు. రైల్వేరంగాన్ని ప్రయివేటుపరం చేసే ప్రక్రియను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దానివల్ల రిజర్వేషన్ సౌకర్యాలు కోల్పోయి ఎస్సీ,ఎస్టీలు తీవ్రంగా అన్యాయానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ రైల్వే ఒక లక్ష 23 వేల 542 కిలోమీటర్ల ట్రాక్ కలిగి ఉందన్నారు. 7,300 రైల్వే సేషన్లున్నాయని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో 8.1 బిలియన్ ప్రయాణీకులను, 1.23 బిలియన్ సరుకులను గమ్యాన్ని చేర్చిందని చెప్పారు. 1.3 బిలియన్ ఉద్యోగులున్నారని అన్నారు. రైల్వేను ప్రయివేటుపరం చేసే ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి, రైల్వే మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యదర్శి శంకర్‌రావు, రైల్వే రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ సిన్హా, నాయకులు ఉన్నీ, సుంకప్ప, చంద్రమోహియార్, యుగంధర్, యాదవరెడ్డి, మోహన్‌బల్లా తదితరులు పాల్గొన్నారు.