Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య
నవతెలంగాణ -నకిరేకల్
ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం వ్యవసాయ కార్మికులు ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణకేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టం రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 716 జిల్లాలో ఉపాధి హామీ చట్టం అమలు అవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 32 కోట్ల మంది కూలీలు పని చేసేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్న కూడా ప్రభుత్వం వారికి పని కల్పించే పరిస్థితిలో లేదన్నారు. కూలీల అందరికీ పని కల్పించాలంటే రూ 2.64 లక్షల కోట్లు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కేవలం రూ. 98 వేల కోట్లు మాత్రమే కేటాయించగా ఈ బడ్జెట్లో రూ. 73 వేల కోట్లు మాత్రమే కేటాయించి రూ. 25 వేల కోట్లు కోత విధించిందని అన్నారు. ఉపాధికి అధిక నిధులు కేటాయించేందుకు వ్యవసాయ కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జ చిన్న వెంకులు అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో జిల్లా ప్రధాన కార్యదర్శి నారి ఐలయ్య, ఏవైకేఎస్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు కందాల ప్రమీల, జిల్లా ఉపాధ్యక్షుడు కత్తుల వీరస్వామి, లగి శెట్టి శ్రీనివాసులు, చింతపల్లి లూర్దూ మారయ్య, నరసింహ, చెవు గొని నాగయ్య, ఆరూరి నరసింహ, లక్ష్మీ నరసింహ, సత్తయ్య, శివలింగం, రాములు పాల్గొన్నారు.